పరిచయం అక్కర్లేని పేరు.. వాగ్ధాటికి మారుపేరు!

పరిచయం అక్కర్లేని పేరు.. వాగ్ధాటికి మారుపేరు!


ముప్పవరపు వెంకయ్యనాయుడు.. దేశరాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు.  సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాషాయదళంలో వివిధ హోదాల్లో పనిచేశారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్య.. ఇప్పుడు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికై.. ఈ అత్యున్నత పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా ఆయన ప్రొఫైల్‌ ఇది.


వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1వ తేదీన జన్మించారు. ఆయన తండ్రిపేరు రంగయ్యనాయుడు. తల్లి శ్రీమతి రమణమ్మ. వెంకయ్య నాయుడు ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరు జిల్లాలోనే జరిగింది. నెల్లూరులోని వీఆర్‌ కళాశాల నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో బీఏ పట్టా పొందారు. తర్వాత విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్‌ పూర్తి చేసి లా పట్టా అందుకున్నారు. వెంకయ్యకు భార్య ఉషతోపాటు  కొడుకు హర్ష, కూతురు దీప ఉన్నారు.వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్యనాయుడు.. విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవక్‌గా పనిచేశారు. ఏబీవీపీలో చేరి నెల్లూరు వీఆర్‌ కాలేజిలోపాటు ఆంధ్రా యూనివర్శిటీలోనూ స్టూడెంట్స్‌ యూనియన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1972 జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్య క్రియాశీలంగా పనిచేశారు. విజయవాడ, నెల్లూరుల్లో ఉద్యమాలు చేపట్టి తన వాక్‌చాతుర్యంతో వెలుగులోకి వచ్చారు. 1978లో తొలిసారిగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1980 నుంచి 83 వరకూ బీజేపీ అఖిలభారత యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.1988 నుంచి 93 వరకూ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య... తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1998 ఏప్రిల్‌లో కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ బోర్డుల్లో సభ్యునిగా, ఛైర్మన్‌గా పనిచేశారు. 2000 సెప్టెంబర్‌ నుంచి 2002 జూన్‌ వరకూ కేంద్రంలోని వాజ్‌పేయి సర్కార్‌లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా సేవలందించారు.


2002 జూలైలో భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులై.. 2004 అక్టోబర్‌ వరకూ ఆ పదవిలో కొనసాగారు. 2014లో మోదీ కేబినెట్‌లో సమాచార ప్రసారాలశాఖతోపాటు పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా నియమితులయ్యారు. రాజకీయాల్లో ఉన్నతశిఖరాలను అందుకున్న వెంకయ్యనాయుడు సామాజిక కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్ట్‌ ద్వారా తెలుగురాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఆయన గురించి మరిన్ని వివరాలివి..


 


 • నెల్లూరు జిల్లా చవటపాలెం వెంకయ్య స్వస్థలం

 • 1949 జూలై 1న జననం

 • నెల్లూరు వీఆర్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య

 • నెల్లూరు వీఆర్‌ కళాశాల నుంచి బీఏ పట్టా

 • 1972 జై ఆంధ్రా ఉద్యమంలో క్రియాశీలపాత్ర

 • 1978లో తొలిసారి అసెంబ్లీకి ఎంపికైన వెంకయ్య

 • 1980-83 వరకూ బీజేపీ యూత్‌వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

 • 1988-93 వరకూ ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు

 • 1998లో తొలిసారి రాజ్యసభకు ఎన్నిక

 • 2000-2002 వరకూ కేంద్రమంత్రిగా బాధ్యతలు

 • 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడైన వెంకయ్య

 • 2005 ఏప్రిల్‌ లో పార్టీ ఉపాధ్యక్ష పదవిBack to Top