ఉప రాష్ట్రపతి: నాయుడా.. సాగర్జీనా?

ఉప రాష్ట్రపతి రేసులో ఉత్కంఠ!

  • రేసులో ముందున్న వెంకయ్యనాయుడు

  • పరిగణనలో సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పేరు

  • సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం  • న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంట నిత్యం కనిపించిన వ్యక్తి వెంకయ్యనాయుడు. కోవింద్‌కు అడుగడుగునా సహకరించడమే కాదు.. ఆయన వెంట రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన వెంట వెంకయ్య నాయుడు కలిసి నడిచే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంటున్నది. ఉప రాష్ట్రపతి రేసులో బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు పేరు ముందంజలో ఉందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగం ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించనుంది. దక్షిణాదికి చెందిన వ్యక్తికే అవకాశం లభించనుందని వినిపిస్తోంది. దక్షిణాదిలో బీజేపీ బలోపేతం కావాలనుకోవడమే ఇందుకు కారణం..    ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇంకా వెంకయ్యనాయుడు పేరు పూర్తిగా ఖరారు కాలేదని సమాచారం. ప్రధాని మోదీ తన కేబినెట్‌ సహచరుడిని వదులుకునేందుకు ఇష్టపడితేనే ఆయనకు చాన్స్‌ దొరకవచ్చునని అంటున్నారు. ఈ కారణంతోనే రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రులకు అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే. వెంకయ్య మాత్రం రాష్ట్రపతి పదవి అంటే తనకు ఏమాత్రం ఇష్టంలేదని తేల్చిచెప్తున్నారు. 'నేను రాష్ట్రపతికానీ, ఉప రాష్ట్రపతికానీ కావాలనుకోవడం లేదు. ఉషాపతి (వెంకయ్య భార్య ఉషా)గా ఉండటమే నాకు ఇష్టం' అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఉపరాష్ట్రపతి పదవి రేసులో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సాగర్‌జీకి కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంటున్నది. ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దొరుకుతుంది.. చివరినిమిషంలో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వస్తుందా? వేచిచూడాలి.

Back to Top