కదిలే దీవి... ఈ ఓడ

కదిలే దీవి... ఈ ఓడ


 ప్రపంచంలో అతి పెద్ద నౌక ఏదంటే... మెర్‌స్క్ కంపెనీకి చెందిన మెక్‌కిన్నే మోలరే. ఇది ప్రయాణం మొదలెట్టి 5 నెలలే అయింది. కానీ అంతలోనే ఆ రికార్డును చెరిపేయటానికి ఇంధన దిగ్గజం రాయల్ డచ్ షెల్ రెడీ అయిపోయింది. ఇది తయారు చేస్తున్న ప్రిల్యూడ్ విస్తీర్ణం... నాలుగు ఫుట్ బాల్ మైదానాలంత. పొడవు 488 మీటర్లు. బరువు 6 లక్షల టన్నులపైనే. ఖర్చు మన కరెన్సీలో రూ.73వేల కోట్లు. 2017 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్న ఈ నౌక... ఓ కదిలే దీవి.

 

 సముద్ర గర్భంలో వెలికితీసే గ్యాస్‌ను పైప్‌లైన్ల ద్వారా తీరానికి చేరుస్తారు. కాకపోతే పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రిల్యూడ్ గ్యాస్ క్షేత్రం... తీరానికి 125 మైళ్ల దూరంలో ఉంది. అందుకని గ్యాస్ రవాణాకు ఓ కదిలే ఎల్‌ఎన్‌జీ కేంద్రాన్ని నిర్మించాలని షెల్ కంపెనీ భావించింది. ఆ మేరకు పుడుతున్నదే ప్రిల్యూడ్ నౌక. ఇక్కడ వెలికితీసే గ్యాస్‌ను ప్రిల్యూడ్‌లో నిల్వచేసి... బోట్ల ద్వారా ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తారు. ‘‘కదపడానికి వీల్లేని పైప్‌లైన్ల వంటి స్థిరమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించే బదులు ఇలాంటి నౌకలతో చాలా లాభం ఉంటుంది. ఒకవేళ ఆ క్షేత్రంలో గ్యాస్ పూర్తయిపోతే ఓడను మరో క్షేత్రానికి తరలించుకుపోయే వెసులుబాటు ఉంటుంది’’ అనేది నిపుణుల మాట.

 

 ఇవీ... ప్రిల్యూడ్ విశేషాలు

     అమెరికాలో అత్యంత ఎత్తయిన భవంతుల్లో ఒకటైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (381 మీటర్లు), మలేసియాలోని పెట్రోనాస్ టవర్స్ (452 మీటర్లు) కన్నా పొడవైనది.

     3,000 కిలోమీటర్ల మేర పొడవుండే ఎలక్ట్రికల్ కేబుల్స్‌ని దీన్లో ఉపయోగిస్తారు.  

     దీన్ని నిలిపేచోట తీవ్రమైన గాలులు వీస్తుంటాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడేలా ప్రిల్యూడ్‌ని డిజైన్ చేశారు. పదివేల ఏళ్లకొకసారి వచ్చే తుపాన్లు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, 65 అడుగుల ఎత్తున ఎగిసిపడే అలలను సైతం ఇది తట్టుకోగలదట.

 

     ముంబై లాంటి రెండు పెద్ద నగరాలకు, లేదా హాంకాంగ్ వంటి అత్యంత భారీ నగరానికి విద్యుత్ ఇవ్వగలిగేంత గ్యాస్‌ను ప్రిల్యూడ్ ఉత్పత్తి చేస్తుందని అంచనా.

     అమెరికాలో అతి పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కన్నా ఆరు రెట్లు పెద్దది.

     రవాణాకి వీలుగా ఉండేలా... దీన్లో గ్యాస్‌ని ఫ్రీజ్ చేసి మైనస్ 161 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేస్తారు. 600 రెట్లు కంప్రెస్ చేస్తారు. వారానికోసారి ఓ భారీ ట్యాంకర్ ఈ గ్యాస్‌ని తీసుకెడుతుంది. జపాన్, చైనా, కొరియా తదితర దేశాలకు ఈ గ్యాస్ ఎగుమతి అవుతుంది.

 

     50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. పాతికేళ్ల తర్వాత ప్రస్తుత క్షేత్రంలో గ్యాస్ అయిపోతుంది. మెరుగులు దిద్ది మరో క్షేత్రానికి తీసుకెడతారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top