పన్నీర్‌ తిరుగుబాటు చేయకుంటే..?

పన్నీర్‌ తిరుగుబాటు చేయకుంటే..? - Sakshi


చెన్నై: శశికళపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవిని పన్నీర్‌ సెల్వం చేజార్చుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చిన్నమ్మ చెప్పినట్టు వింటే సీఎం సీటులో కొనసాగేవారన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నెల 5న పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎంకే శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 7న) శశికళపై తిరుగుబాటు చేశారు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలయ్యారు.



పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు చేయకుండా ఉంటే మళ్లీ సీఎంగా ఆయననే ‘చిన్నమ్మ’ కొనసాగించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శశికళను ఢీకొట్టి పదవితో పాటు పార్టీకి దూరమయ్యారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఒకవేళ సీఎం పదవి దక్కకపోయినా గతంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పోస్టు దక్కేదని సానుభూతి పరులు పేర్కొంటున్నారు.



‘చిన్నమ్మ’, పార్టీకి విధేయుడిగా సెల్వం కొనసాగితే మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ప్రకటించివుండేవారన్న వాదనలు విన్పిస్తున్నాయి. తనకు ఎదురు తిరిగిన పన్నీర్‌ సెల్వంపై జైలుకు వెళుతూ శశికళ కక్ష తీర్చుకున్నారు. పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చొపెట్టి పన్నీర్‌ పై ప్రతీకారం సాధించారు. దీంతో పన్నీర్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top