త్వరలోనే కొత్త గవర్నర్లు!

త్వరలోనే కొత్త గవర్నర్లు!


- నరసింహన్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు

- తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శంకర్‌మూర్తి?

- ఉప రాష్ట్రపతి ఎన్నికలయ్యాక మార్పులకు నిర్ణయం

- ప్రతిపాదనలు సిద్ధం చేసిన కేంద్ర హోం శాఖ
సాక్షి, హైదరాబాద్‌:
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను త్వరలోనే మార్చే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగియగానే కొత్త గవర్నర్‌ను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. ఇటీవల గవర్నర్‌ ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో కేంద్ర హోం శాఖ వర్గాలు సూచనప్రాయంగా  ఈ సంకేతాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే నెలలో ముగిసిన పదవీకాలాన్ని పొడిగించటంతో మరికొంత కాలం తనను ఇక్కడే కొనసాగిస్తారని గవర్నర్‌ ఆశించారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మొదలవటంతో పాటు ఉప రాష్ట్రపతి రేసులో ఎన్‌డీఏ పక్షాన నరసింహన్‌ పేరు ప్రధానంగానే వినిపించింది. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో కేంద్రం నరసింహన్‌కు మరో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో ఇంటెలిజెన్స్‌లో పని చేసిన అనుభవముండటంతో సెక్యూరిటీ వింగ్‌ లేదా ఇంటెలిజెన్స్‌ వ్యవహారాల్లో ఆయనకు ఏదో ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగియగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లు:

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ స్థానంలో ఏపీకి, తెలంగాణకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన సీనియర్‌ నాయకుడు శంకర్‌మూర్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. 2010 జనవరిలో నరసింహన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో గవర్నర్‌ బాధ్యతలను నిక్కచ్చిగా నిర్వర్తించారు. అదే సందర్భంలో.. 2012 మే 3న మరో ఐదేళ్లపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మే 3వ తేదీతో నరసింహన్‌ పదవీకాలం ముగిసింది. కానీ.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు గవర్నర్‌గా కొనసాగాలని  కేంద్రం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గవర్నర్‌కు మౌఖిక అదేశాలు జారీ చేశారు. దీంతో తదుపరి ఉత్తర్వులెప్పుడొస్తాయి.. ఎంతకాలం నరసింహన్‌ గవర్నర్‌గా కొనసాగుతారనే ఉత్కంఠ కొనసాగింది.గవర్నర్‌గా ఉండేందుకు మొగ్గు

ఇటీవల ఉప రాష్ట్రపతి ఎన్నికల రేసులో తన పేరు వినిపించటంతో నరసింహన్‌ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా కేంద్ర పెద్దల వద్ద తనకున్న పరిచయాలతో మరోసారి గవర్నర్‌ ఛాన్స్‌కు  నరసింహన్‌ ఆసక్తి చూపినట్లు తెలిసింది. కానీ.. కొత్త గవర్నర్‌ వచ్చేంత వరకు పదవిలో కొనసాగాలని సూచించాలని .. అంతకు మించి కీలక బాధ్యతలు అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గవర్నర్‌ను తిప్పి పంపినట్లు తెలిసింది.

Back to Top