మణిపూర్లో ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్


రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ ఇంజినీర్లతోపాటు మరో ఐదుగురిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం మణిపూర్లో వెల్లడించారు. ఇంఫాల్లోని వర్క్సైట్లో నిర్మాణ పనులను పర్యవేక్షించి తిరిగి వస్తుండగా తూర్పు ఇంఫాల్ జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి వారిని ఆయుధాలు ధరించిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలిపారు. అనంతరం వారిని అజ్ఞాత ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇది తీవ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నామని చెప్పారు.


 


సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎన్.కర్ణరాజ్, ఎగ్జీక్యూటీవ్ ఇంజినీర్ ఎన్.సురచంద్రతోపాటు కాంట్రాక్టర్ సనైమ శర్మ, ఇద్దరు డ్రైవర్లు అభిజిత్ సిన్హా, దేబజిత్ సిన్హాలు కిడ్నాపునకు గురైనట్లు గుర్తించామన్నారు. నగదు కోసమే ఆ కిడ్నాప్ చేసినట్లు తాము భావిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. నీటిపారుదల విభాగం ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పలు పథకాలను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఏడుగురికి ఎటువంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని ఉన్నతాధికారులు కిడ్నాపర్లకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటి వరకు తామే ఆ కిడ్నాప్నకు పాల్పడిందని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని అధికారులు స్ఫష్టం చేశారు.




ఇది ఇలా ఉంటే మత్తుమందును అక్రమంగా రవాణా చేస్తున్న యునైటెడ్ పీపుల్స్ రివల్యూషన్ ఫ్రంట్ (యూపీఆర్ఎఫ్)కు చెందిన ముగ్గురు తీవ్రవాదులను 40వ అస్సాం రైఫిల్స్ బృందం శుక్రవారం అరెస్ట్ చేసింది. ఇంఫాల్ సరిహద్దులోని చండెల్ జిల్లాలోని మోరెహ్ పట్టణ సరిహద్దుల్లో శుక్రవారం రైఫిల్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. అందులో భాగంగా కారులో వెళ్తున్న ముగ్గురిని తనిఖీ చేయగా వారి వద్ద నగదు, మత్తుమందులతోపాటు 9 ఎంఎం పిస్టల్ను వారు స్వాధీనం చేసుకున్నారు.


అనంతరం వారిని లిలాంగ్ పోలీసు స్టేషన్కు తరలించి, పోలీసులకు అప్పగించారు. తీవ్రవాదులు మత్తుమందును మయన్మార్కు తరలిస్తున్నట్లు తమ ప్రాధమిక విచారణలో వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కారు, నగదు, మత్తుమందులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top