ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు


న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నాయకుడి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌ గవర్నర్‌ రామనాథ్‌ కోవింద్‌ పేరు ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో కోవింద్‌ పేరును ప్రకటించారు. అందరితో చర్చించిన తర్వాతే ఆయనను అభ్యర్థిగా ప్రకటించామని చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదని తెలిపారు. 23న రామనాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ వేసే అవకాశముంది.

 

ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రామనాథ్‌ పేరును తెరపైకి తెచ్చి బీజేపీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్డీఏ పక్షాలు సైతం ఆయన పేరును ఊహించలేకపోయాయి. దళిత నాయకుడైన రామనాథ్‌ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న డేరాపూర్‌‌. 1945, అక్టోబర్‌ 1న ఆయన జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. 1994-2006 మధ్య కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2015 నుంచి బిహార్‌ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. రాజ్‌నాథ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు.

Back to Top