మోదీకి పద్మాసనం రాదు!

మోదీకి పద్మాసనం రాదు! - Sakshi


న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఎంతో కష్టపడి బలోపేతం చేసిన ప్రజా వ్యవస్థలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రెండున్నర ఏళ్లల్లోనే ధ్వంసం చేశాయని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీ పేదలతో ఏనాడూ మాట్లాడలేదని, ప్రజల సమస్యలకు ఆయనకు తెలియవని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుతో మాత్రమే ‘అచ్ఛే దిన్‌’(మంచిరోజులు) వస్తాయని అన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన జన వేదన సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షడు.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. యావతత్‌ దేశాన్ని ఒక్క మోదీనో, మోహన్‌ భగవతో తమ ఇష్టానుసారంగా పాలిస్తామంటే అంగీకరించబోమని హెచ్చరించారు.



‘ఆర్‌బీఐ, జ్యుడిషియరీ, ప్రెస్‌ తదితర వ్యవస్థలన్నింటిని బీజేపీ ధ్వంసం చేసింది. మోదీ వ్యక్తిగతంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ 15 ఏళ్లు వెనక్కి పోయింది. సాధారణంగా పల్లెల నుంచి పట్టణాలకు సాగే వలసలు.. ఇవ్వాళ రివర్స్‌ అయ్యాయి. నోట్ల రద్దుతో పట్టణాల్లో పని కోల్పోయిన ఎందరో పేదలు గ్రామాలకు తిరుగుబాట పట్టారు. ఉపాధి హామీ పధకానికి డిమాండ్‌ పెరుగుతుండటమే ఇందుకు సజీవ ఉదాహరణ’ అని రాహుల్‌ అన్నారు.



మోదీకి పద్మాసనం రాదు!

మోదీ పేదలను పట్టించుకోరన్న రాహుల్‌.. వివరణగా ‘పద్మాసనం’ ముచ్చట చెప్పారు. ‘వ్యవస్థలన్నీ ప్రాథమికంగా ప్రజల కోసమే పనిచేస్తాయి. యోగాలో పద్మాసనం ప్రాథమిక ఆసనం. విచిత్రమేంటంటే ఈ రెండూ మోదీకి పట్టవు. ఆయన ప్రజలను పట్టించుకోవడం తెలియదు.. పద్మాసనమూ వేయలేడు’ అని రాహుల్‌ చమత్కరించారు. అచ్ఛేదిన్‌(మంచి రోజులు) కోసం రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తోన్న ప్రజలు.. మరి కొంతకాలం ఓపిక పట్టాలని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతగానీ మంచి రోజులు రావని రాహుల్‌ వ్యాఖ్యానించారు. మరో యువనేత సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ..‘పద్మాసనం చేతకాని మోదీ నోట్ల రద్దుతో దేశప్రజలను శీర్షాసనం వేయించార’ని ఎద్దేవా చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top