ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

Press For Progress Is Theme Of International Womens Day - Sakshi

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌ : ఈ ఏడాది  మహిళా దినోత్సవ ప్రస్తావన అంశంగా ‘ప్రెస్‌ ఫర్‌ ప్రోగ్రెస్‌’ ( ముందుకు సాగేందుకు పట్టుపట్టండి లేదా పురోగతికి పట్టుపట్టండి)ను ఐరాస ఖరారు  చేసింది. ఇటీవల. గత కొన్నేళ్లుగా మహిళలు పురోగతి సాధిస్తున్నా ఆడ–మగ తారతమ్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితుల్లో    ‘ప్రెస్‌ ఫర్‌ ప్రోగ్రెస్‌’.. ముఖ్యమైన సమస్యలు, అంశాలు గుర్తుకు తెచ్చేందుకు ఉపయోగపడనుంది. సమానహక్కుల సాధన కోసం తమ  పోరాటాన్ని  కొనసాగించేందుకు ఇది చోదకశక్తిగా పనిచేస్తుందని మహిళలు విశ్వసిస్తున్నారు.

ఇంకా రెండు శతాబ్దాల దూరం...
స్త్రీ–పురుష సమానత్వ సాధనకు మరో 200 ఏళ్లకు పైగానే పడుతుందని  2017లో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రపంచ లింగ అంతరాల నివేదిక వెల్లడించింది. ప్రపంచస్థాయిలో మీ టూ, టైమ్స్‌ అప్‌ వంటి లెక్కకు మించి ఉద్యమాల నేపథ్యంలో  ప్రెస్‌ ఫర్‌ ప్రోగ్రెస్‌కు భూమిక ఏర్పడింది. ప్రతీ ఏడాది మార్చి 8న  ఏదో ఒక అంశంపై   మహిళా దినోత్సవం జరుపుకున్నా,  ఆ సంవత్సరమంతా మహిళా గ్రూపులు, బృందాలు, ఇతర సాధనాల ద్వారా  వివిధదేశాల్లో ప్రచారం ఊపందుకుంటుంది. ఇవన్నీ కూడా ఒకే లక్ష్యంతో పనిచేసేందుకు ఇది దోహదం చేస్తోంది.

విమెన్స్‌ డే నేపథ్యమిదీ..
ప్రతీ ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1975లో  ఐరాస ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడానికి ముందు నుంచే మహిళా దినోత్సవాన్ని సోషలిస్ట్, కమ్యూనిస్టు దేశాల్లో దీనిని జరుపుకుంటున్నారు. ∙వందేళ్లకు పూర్వం నుంచే అంటే 1900ల నుంచే ఏ గ్రూపుతో సంబంధం లేకుండా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహిళలకు ఓటుహక్కు కోసం ఇది మొదలైంది. మొదట  దీనిని ‘ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌ విమెన్స్‌ డే’గా జరుపుకున్నా, 1911  మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో  మొదటిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. 1914లో మొదటి ప్రపంచయుద్ధానికి నిరసనగా, సహచర కార్యకర్తలకు సంఘీభావంగా మార్చి 8న మహిళలు ప్రదర్శనలు నిర్వహించారు. అప్పటి నుంచి ఆ ఒరవడి కొనసాగుతోంది.

‘థీమ్‌’ కూడా ముఖ్యమే...
ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కుంటున్న పీడనను తెలియజేయడంతో పాటు వారి హక్కులను సమున్నతంగా  ఎత్తిచూపేందుకు ఏ ఏడాదికి ఆ ఏడాది నిర్థారించే నినాదం (థీమ్‌) ఉపయోగపడుతోంది. ఐరాస  2012లో ‘గ్రామీణ మహిళలను సాధికారులను చేయాలి–ఆకలి,దారిద్య్రాన్ని అంతమొందించాలి’ అనే నినాదాన్ని తీసుకుంది. 2013లో ‘ఏ ప్రామిస్‌ ఈజ్‌ ఏ ప్రామిస్‌’. 2014లో ‘ మహిళలకు సమానత్వంతోనే అందరి పురోగతి’, 2015లో ‘ఎంపవరింగ్‌ విమెన్, ఎంపవరింగ్‌ హ్యుమానిటీ : పిక్చర్‌ ఇట్‌’, 2016లో ‘ప్లానెట్‌ 50–50 బై 2030 : స్టెప్‌ ఇట్‌ అప్‌ ఫర్‌ జెండర్‌ ఈక్వాలిటీ’, 2017లో ‘విమెన్‌ ఇన్‌ది ఛేంజింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌ :ప్లానెట్‌ 50–50 బై 2030’ అనే ప్రస్తావనాంశాల ద్వారా ముఖ్యమైన సమస్యలపై చర్చ జరిగేలా చేసింది.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top