కొత్త రాగంతో నరేంద్ర మోదీ పాత పాట

కొత్త రాగంతో నరేంద్ర మోదీ పాత పాట

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు కష్టాల నుంచి పేద ప్రజల దష్టిని మళ్లించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 31వ తేదీన చేసిన ప్రసంగంలో గర్బిణీ స్ల్రీల ఖాతాల్లోకి నేరుగా ఆరువేల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేస్తుందని హామీ ఇచ్చారు. తల్లుల పౌష్టికాహారం కోసం, పిల్లల సంరక్షణ కోసం ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ ఆర్థిక సహాయం కొత్త స్కీమ్‌ ఎంతమాత్రం కాదు. 

 

2013లో కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ భద్రతా ఆహార పథకం’ను తీసుకొచ్చింది. ఈ చట్టం కింద మెటర్నరీ ప్రయోజనాలు పొందటం సార్వత్రిక హక్కని పేర్కొంది. ఈ ప్రయోజనాల కింద గర్బిణీ స్త్రీలకు ఆరువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. చట్ట ప్రకారం ఈ హామీని అమలు చేయడానికి కొత్త స్కీమ్‌ను తీసుకరావాల్సిన అవసరం ఏర్పడింది. ‘మాకు కావాల్సింది కార్యాచరణ గానీ చట్టాలు కావు’ అని నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ విమర్శించారు. చట్టం బలహీనంగా ఉందంటూ ఆరోపించారు. 

 

మూడేళ్లు కార్యాచరణ ఎక్కడ?

 

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. ఆడవాళ్ల మెటర్నరీ ప్రయోజనాల కోసం ఆయన చేపట్టిన కార్యాచరణ లేదు. చట్టాలు లేవు. పెద్ద నోట్ల రద్దుతో ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయంటూ ప్రజలను భ్రమపెట్టేందుకు ఆయన గర్బిణీ స్త్రీలకు ఆరువేల ఆర్థిక సహాయం అంటూ పాత పాటను కొత్త రాగంతో అందుకున్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం 2013లోనే ఆరువేల రూపాయలను ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన కింద ఇచ్చే మొత్తం ఈ మూడున్నర ఏళ్లలో ఎంతో పెరగాలి. పైగా 2013లో జాతీయ భద్రతా ఆహార పథక చట్టాన్ని తీసుకొచ్చిన నాటి నుంచే అమలు చేయాలి. ఈ విషయంలో మోదీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

 

తమిళనాడులో రూ. 12,000

 

గర్బిణీల ప్రయోజనాల కింద ఎప్పటి నుంచే తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలు ఈ ఆర్థిక సహాయ స్కీమ్‌లను అమలు చేస్తున్నాయి. తమిళనాడులో ‘డాక్టర్‌ ముత్తులక్ష్మీ రెడ్డి గర్బిణీ ప్రయోజన పథకం’ పేరిట ప్రతి గర్బిణీ స్త్రీకి 1987 నుంచే 12వేల రూపాయలను చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని 18వేలకు పెంచుతామని అంటున్నారు. ఇక ఒడిశాలో మమతా స్కీమ్‌ కింద గర్బిణీ స్త్రీలకు ఐదువేల రూపాయల చొప్పున 2011 నుంచి చెల్లిస్తున్నారు. తమిళనాడులో మొత్తం ప్రసవాల్లో నాలుగోవంతు మహిళలకు ప్రయోజనం కలుగుతోంది. ఒడిశాలో మూడొంతుల మందికి ప్రయోజనం కలుగుతోంది. ప్రసవం కేసుల్లో యాభై శాతం మంది మహిళలకు స్కీమ్‌ను అమలు చేసేందుకు ఇరు రాష్ట్రాలు కషి చేస్తున్నాయి. గర్భవతి అయినప్పుడు అంగనవాడీల వద్ద పేరు నమోదు చేసుకోవడం, ఆ కేంద్రాల వద్ద ప్రాథమిక పరీక్షలు విధిగా చేయించుకోవడం లాంటి షరతులు ఉండడం వల్ల నగదు మంజూరు చేయడానికి కొత్త లంచం ఇవ్వాల్సి వస్తోందన్న ఆరోపణలు కూడా ఇరు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. 

 

కనువిప్పు కలిగిందా?

 

యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2014లో తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన మోదీ 2015 చివరి నాటికి మాట మార్చారు. ఆ పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. 2013లో జాతీయ ఆహార భద్రతా పథకాన్ని విమర్శించిన మోదీ ఇప్పుడు అదే బాటను అనుసరిస్తున్నారు. మున్నుందు ఇంకెన్ని ‘యూటర్న్‌’లు ఉంటాయో చూడాలి. 
Back to Top