అమెరికాలో మరో భారతీయుడికి కీలక పదవి


 వాషింగ్టన్: అమెరికాలో మరో ప్రవాసభారతీయుడిని కీలక పదవి వరించింది. ట్రెజరీ శాఖలోని కంట్రోలర్ ఆఫ్ ద కరెన్సీ(ఓసీసీ)లో అప్లికేషన్ సర్వీసెస్ డెలివరీ విభాగానికి ఉప ముఖ్య సమాచార అధికారిగా జవహర్ కల్యాణి నియమితులయ్యారు. అప్లికేషన్ల అభివద్ధి, అమలు కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహించనున్నారని ఒక అధికారిక ప్రకటన జారీ అయింది. జవహర్‌కు ఉన్న అనుభవంతో ఈ బాధ్యతలు గొప్పగా నిర్వహించగలరని ఓసీసీ ముఖ్య సమాచార అధికారి ఎడ్వర్డ్ డోరిస్ తెలిపారు.



ఇప్పటి వరకు జవహర్ కల్యాణి ఆమ్‌డాక్స్  అనే కంపెనీలో పనిచేశారు. అక్కడ కస్టమర్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రముఖ టెలికాం కంపెనీలకు బిజినెస్ ఐటీ సొల్యూషన్లు, ఇతర సేవల అభివద్ధి, నిర్వహణ, పంపిణీ వంటి కీలక బాధ్యతలు చూశారు. ఈ రంగంలో ఆయనకు 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ముంబైలోని వీరమాత జిజాబాయ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఈ డిగ్రీ, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ డిప్లొమో పూర్తి చేసిన జవహర్ కల్యాణి అనంతరం అమెరికలో ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top