టీఆర్ఎస్ నిబంధనల్లో భారీ మార్పులు

టీఆర్ఎస్ నిబంధనల్లో భారీ మార్పులు - Sakshi


హైదరాబాద్‌: తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్‌) సంస్థాగత నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు రెండేళ్లకోసారి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుగుతుండగా, ఇకపై ఆ కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచారు. జిల్లా కమిటీలను పూర్తిగా రద్దుచేశారు. ఇక జిల్లా కమిటీల బదులు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతాయి. ఈ కమిటీల కాలపరిమితి కూడా నాలుగేళ్లకు పెంచారు. ఈ నిర్ణయాలను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొంపల్లి(హైదరాబాద్‌)లోని జీబీఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ 16వ ప్లీనరీ వేదికపై ప్రకటించారు. ప్లీనరీ ముగింపు సంసందర్భంగా ప్రసంగించిన కేసీఆర్‌ విమర్శకులను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు.



’ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం. విపక్షాలు గుడ్డి విమర్శలు మానుకోవాలి. అవినీతిని పెంచిపోషించింది గత ప్రభుత్వాలే. మేం అవినీతిపై యుద్ధం చేస్తున్నాం’అని కేసీఆర్‌ అన్నారు. ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసంలో రైతాంగంపై వరాలు కురిపించిన ముఖ్యమం‍త్రి.. ముగింపు వ్యాఖ్యల్లోనూ రైతు సంబంధిగత అంశాలను ప్రస్తావించారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు ఎంత నష్టపోతే, ఆ మెత్తాన్నీ కంపెనీలు చెల్లించేలా త్వరలో చట్టం రూపొందిస్తామని చెప్పారు. ప్లీనరీ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని సీఎం తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా 27న వరంగల్‌లో జరగబోయే భారీ బహిరంగ సభకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.



ఎనిమిదోసారి కేసీఆర్.. ఏడు తీర్మానాలు..

టీఆర్‌ఎస్ ప్లీనరీ ప్రారంభానికి ముందే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. తద్వారా వరుసగా ఎనిమిదోసారి కేసీఆర్‌ ఆ పదవిని చేపట్టినట్లైంది. అట్టహాసంగా జరిగిన ప్లీనరీలో మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించారు. వీటిలో సంక్షేమం, బీసీ, ఎంబీసీల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక, నీటిపారుదల రంగం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు తదితర తీర్మానాలున్నాయి.



(చదవండి: రైతన్నలపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు!)

(టీఆర్‌ఎస్‌ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్‌)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top