మెక్‌డీలో ఇక మసాలా దోశ బర్గర్లు, అండా బుర్జీ!

మెక్‌డీలో ఇక మసాలా దోశ బర్గర్లు, అండా బుర్జీ!

ఇంతకాలం పీజాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటూ విదేశీ రుచులను మాత్రమే అందిస్తూ వచ్చిన బహుళజాతి సంస్థ మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్ ఇప్పుడు దారి మార్చుకుంది. మసాలా దోశ బర్గర్లు, మొలాగా పోడి సాస్, అండా భుర్జీ.. ఇలాంటి వాటన్నింటినీ తన బ్రేక్‌ఫాస్ట్ మెనూలో చేరుస్తోంది. ముంబైలో త్వరలోనే మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంటులో ఈ స్వదేశీ బ్రేక్‌ఫాస్ట్ మెనూ రానుంది. ఇంతకాలం ఫ్రై ఐటెమ్స్ మీదే ఎక్కువగా దృష్టిపెట్టిన ఈ సంస్థ.. ఈ కొత్త రుచులను మాత్రం గ్రిల్డ్ పద్ధతిలో అందిస్తామని చెబుతోంది. 

 

ముంబైలోని మొత్తం 44 మెక్‌డీ ఔట్‌లెట్లలో ఈనెల 13 నుంచి కొత్త రుచులు అందుబాటులోకి వస్తాయి. రూ. 30 నుంచి రూ. 135 వరకు ధరలలో ఇవి ఉన్నాయి. మెక్‌డెలివరీ, టేకెవే కియోస్క్‌ల ద్వారా కూడా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను అందిస్తామని చెబుతున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ కొత్త మెనూను అందిస్తామన్నారు. ఎక్కువమంది బ్రేక్‌ఫాస్ట్ సెగ్మెంటులోకే వస్తున్నారని, అందువల్ల ఈ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్ సంస్థ వైస్‌ చైర్మన్ అమిత్ జతియా చెప్పారు. ఈ సంస్థ పశ్చిమ, దక్షిణ భారతదేశాల్లోని 240 మెక్‌డీ రెస్టారెంటులను నిర్వహిస్తోంది. అందుకోసమే తాము వెస్ట్రన్ సర్వీసుల కంటే భారతీయ బ్రేక్‌ఫాస్ట్ మార్కెట్లోకి వస్తున్నామని ఆయన తెలిపారు. 
Back to Top