తొలిరోజు 'ఖైదీ' కలెక్షన్ల సునామీ!
'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత నటించిన సినిమా 'ఖైదీ నంబర్‌ 150'. ఈ సినిమా ఊహించినట్టుగానే భారీ కలెక్షన్లను రాబడుతున్నది. మొదటిరోజు భారీ వసూళ్లతో రికార్డులు సృష్టిస్తున్నది. దేశవ్యాప్తంగా బుధవారం విడుదలైన ఈ సినిమాకు అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ఇక అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల తుఫాన్‌ సృష్టించిందని ప్రముఖ బాలీవుడ్‌ ట్రెడ్‌ అనాలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. అమెరికాలో మంగళవారమే విడుదలైన ఈ సినిమా 12 లక్షల 51 వేల 548 డాలర్లు (రూ. 8.56 కోట్లు) వసూలు చేసిందని ఆయన వెల్లడించారు. మిడ్‌వీక్‌లో విడుదలైనప్పటికీ ఈ సినిమా అమెరికాలో అద్భుతమైన ఓపెనింగ్స్‌ సాధించిందని తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.మరోవైపు దాదాపు పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ట్విట్టర్‌లో అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా అక్కినేని నాగార్జున, మోహన్‌బాబు, అక్కినేని అఖిల్‌ చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరంజీవి సినిమా ఘనవిజయం సాధించాలని నాగార్జున ఆకాంక్షించారు.


Back to Top