ఈ పోరాటంలో పరాజితులు ఎవరు?

ఈ పోరాటంలో పరాజితులు ఎవరు?


నమస్తే సార్‌, నా పేరు శశి. అప్పట్లో కొబ్బరిచెట్లెక్కి కాయలు తెంపడం నా వృత్తి. కానీ, 18 ఏళ్ల కిందట ఓ రోజు చెట్టుమీద నుంచి కిందపడ్డా. వెన్నెముక, మెదడులో తేడా కొట్టింది. పక్షవాతం వచ్చినట్లు కాలు, చెయ్యి పడిపోయాయి. వైద్యం కోసం చాలానే అప్పు చేశాం. ఏదో ఒక పని చెయ్యనిదే ఇల్లూ గడవదు, అప్పూ తీరదు. అలాగని మిమ్మల్ని డబ్బులు అడుగుతానని అనుకోవద్దు! మా ఇంటికి దూరంగా ఒకచోట బడ్డీ కొట్టు పెట్టాలనుకుంటున్నా. నడవలేనుకదా, ప్రభుత్వం నుంచి నాకొక మూడు చక్రాల బండిని ఇప్పించండయ్యా అని పంచాయితీ పెద్దలను వేడుకున్నా. వాళ్లు నాతో ఏం చెప్పారో తెలుసా?



‘శశి బాబూ, నీ ఇంటికి రోడ్డు లేదుకదయ్యా! చక్రాల బండి ఇంచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి వ్వలేం’అని! నేను బతకాలంటే బండి కావాలి.. బండి కావాలంటే రోడ్డు ఉండాలి.. ఇది అర్థమయ్యాక రోడ్డు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. మండలం ఆఫీసు, జిల్లా ఆఫీసులకెళ్లి అర్జీలు పెట్టా. అయినా, ఊళ్లో పంచాయితీవాళ్లే పట్టించుకోనిది పట్నంలో నా గోస ఎవరికి లెక్క? అలా కొన్నేళ్లుగడిచాయి.



మా ఊళ్లో మేముండే పేట సరిగ్గా గుట్టల మధ్య ఉంటుంది. ఎటైనా పోవాలంటే చిన్నా, పెద్దా అందరూ గుట్ట ఎక్కి దిగాల్సిందే. ఒకరోజెందుకో ‘నా రోడ్డు నేనే తొవ్వుకుంటే పోదా!’ అనిపించింది. ఆ ఆలోచన నాలో ఏదో శక్తిని నింపింది. వెంటనే పార పట్టుకుని గుట్ట తొవ్వడం మొదలెట్టా. పనికి వెళ్లిన ఇంటావిడ సాయంత్రానికి ఇంటికొచ్చి నన్ను చూసి ఏడ్చినంత పని చేసింది. నా చేతుల్లోని పార తీసుకొని అవతల పారేసింది. ఎందుకో ఆమె మాట వినాలనిపించలేదు. పట్టుదలగా గుట్టను తొవ్వా. ఒకటి.. రెండు.. మొత్తం మూడేళ్లు పట్టింది. ఇప్పుడు మూడు చక్రాల బండి వెళ్లగలిగేంత దారి ఉంది నా ఇంటికి. మరి చక్రాల బండి ఇచ్చేదెవరు?



ఇంకో నెల రోజుల్లో పని పూర్తవుతుంది. మూడేళ్ల నుంచి నేను గుట్టను తొవ్వుతున్న సంగతి అందరికీ తెలుసు.. పంచాయితీ పెద్దలు, ప్రభుత్వాధికారులకు కూడా! అయితే వాళ్లేమీ మాట్లాడటంలేదు. నేను కూడా వాళ్లను కలవడం మానేశా. నాకు చక్రాల బండి దక్కకపోయినా, మా పేటకి రోడ్డు వేశాన్న సంతోషం మిగిలింది.



ఇది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా శివారు గ్రామానికి చెందిన శశి అనే వ్యక్తి కథనం. కాలూచెయ్యి పనిచేయకున్నా, కుంటుకుంటూ ఒంటరిగా మూడేళ్లు శ్రమించి గుట్టను తొలిచిన ఈయన నిజజీవిత గాథ.. బిహార్‌ ‘మౌంటెయిన్‌ మ్యాన్‌’ దశరథ్‌ మాంఝీని తలపిస్తుంది. నాడు మాంఝీకి జరిగినట్లే.. నేడు శిశికి కూడా వ్యవస్థ నుంచి ఆదరణ కరువైంది. అయినాసరే, ఇవేవీ పట్టించుకోకుండా వారు పోరాడారు.. పోరాడుతూనే ఉన్నారు..

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top