రేప్‌ కేసు; ‘వికీలీక్స్‌’ అసాంజేకు ఊరట

రేప్‌ కేసు; ‘వికీలీక్స్‌’ అసాంజేకు ఊరట - Sakshi


స్టాక్‌హోమ్‌: ఏడేళ్లుగా వెంటాడుతున్న రేప్‌ కేసు నుంచి వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు, విచారణలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్విడన్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులోనే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు.. లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన అసాంజే, గడిచిన ఐదేళ్లుగా అక్కడే తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.



స్విడన్‌ ప్రభుత్వం తన ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకోవడంతో అసాంజేకు స్వేచ్ఛ లభించినట్లేనని వికీలీక్స్‌ అభిమానులు పేర్కొన్నారు. అయితే, అతను బయట అడుగుపెట్టిన మరుక్షణం అమెరికా అతణ్ని అరెస్ట్‌ చేసే అవాకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడప్పుడే అసాంజే ఈక్వెడార్‌ ఎంబసీ నుంచి బయటికిరాకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయం.



సమ్మతంతోనే సెక్స్‌..

2012లో స్విడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో వికీలీక్స్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. అందులో పాల్గొన్న ఓ అమ్మాయిని తన గదికి పిలిపించుకున్న అసాంజే.. రేప్‌కు పాల్పడ్డాడని స్టాక్‌హోమ్‌లో కేసు నమోదయింది. అయితే తామిద్దరం పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని, కుట్రతోనే రేప్‌కేసు బనాయించారని అసాంజే వాదించారు. సదరు మహిళ సీఐఏ ఏజెంట్‌ అని కూడా అసాంజే నిరూపించే ప్రయత్నం చేశారు. అనంతరం స్టాక్‌హోమ్‌ అధికారులు అసాంజే అరెస్టుకు ఆదేశించారు. అరెస్టు నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆయన ఈక్వెడార్‌ ఎంబసీని ఆశ్రయించారు.



ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్‌ అసాంజే, వికీలీక్స్‌ ద్వారా కీలకమైన దేశాల కార్యకలాపాలకు సంబంధించిన రహస్య పత్రాలను లీక్‌ చేయడం భారీ సంచలనాలకు కారణమైన సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్‌, ఇండియా, పాకిస్థాన్‌ లాంటి పెద్ద దేశాలెన్నో వికీలీక్స​ బాధితులే కావడం గమనార్హం. అందరికంటే ఎక్కువగా ఇబ్బందులు పడ్డ అమెరికా.. అసాంజే అంతుచూస్తానని బాహాటంగానే ప్రకటించింది. తాజాగా గురువారం కూడా సీఐఏ అధికారులు మాట్లాడుతూ ‘అజాంజేను అరెస్ట్‌ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం’అని అన్నారు. అటు, సీఐఏని ‘టెర్రరిస్టుల స్నేహితుడి’గా అసాంజే అభివర్ణించారు. అమెరికా ప్రయత్నాల నేపథ్యంలో అసాంజే రాయబార కార్యాలయం నుంచి బయటికి వస్తారా? రారా? అనేదానిపై స్పష్టత రావాల్సింఉంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top