ప్రోత్సహిస్తే హైదరాబాద్‌లోనే ఏసీల తయారీ ప్లాంటు

ప్రోత్సహిస్తే హైదరాబాద్‌లోనే ఏసీల తయారీ ప్లాంటు - Sakshi


పరిశీలనలో నెల్లూరు జిల్లా తడ

 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ సంస్థ బ్లూ స్టార్ దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇస్తే హైదరాబాద్‌లోనే ప్లాంటు స్థాపిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. పటాన్‌చెరు సమీపంలో ప్లాంటు నెలకొల్పాలని పదేళ్ల క్రితమే సంస్థ భావించింది. అయితే సంస్థ పరిశీలనలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా తడ, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తోపాటు గుజరాత్ రాష్ట్రం కూడా ఉంది. పన్ను ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నామని, ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసేదీ సెప్టెంబర్‌కల్లా నిర్ణయమవుతుందన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఉన్న 7 ప్లాంట్లు కూడా ఉత్తరాదికే పరిమితమయ్యాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల యూనిట్లు. కొత్త ప్లాంటు రూ.150 కోట్ల పెట్టుబడితో, 5 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో రానుంది.

 

స్మార్ట్‌ఫోన్లతో ఏసీలకు సెగ..: పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఏసీల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.త్యాగరాజన్ తెలిపారు. ఖర్చు చేయదగ్గ ఆదాయాన్ని గ్యాడ్జెట్లకు వెచ్చిస్తున్నారని అన్నారు. ఇంట్లో చివరి ఉపకరణంగా ఏసీ వచ్చి చేరుతోందని చెప్పారు. ‘చైనాలో ఏటా 5 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి. మొత్తం గృహాల్లో వ్యాప్తి రేటు 25 శాతముంది. అదే భారత్‌లో 2014లో 37.5 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. ఇక్కడ అపార అవకాశాలున్నాయి. 2015లో పరిశ్రమ 40 లక్షలకుపైగా యూనిట్లకు చేరుతుందని అంచనా’ అని చెప్పారు. 5 స్టార్ ఏసీల వాటా ప్రస్తుతం 25% ఉంది.



వీటిపై సెంట్రల్ వ్యాట్ తగ్గించాలని అన్నారు. వోల్టాస్, ఎల్‌జీ, శాంసంగ్‌ల తర్వాతి స్థానం కోసం బ్లూ స్టార్, హిటాచీ, ప్యానాసోనిక్ పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌జీ, బ్లూ స్టార్, శాంసంగ్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.15 చెల్లిస్తే చాలు..: ఏసీ కోసం రూ.15 చెల్లిస్తే సరిపోతుందని బ్లూస్టార్ అంటోంది. మిగిలిన మొత్తాన్ని వడ్డీ లేకుండా 10 వాయిదాల్లో చెల్లించొచ్చని ముకుందన్ మీనన్ తెలిపారు. ఏసీ కొనాలని ఉన్నా ఒకేసారి చెల్లించే స్తోమత లేనివారు చాలా మంది ఉన్నారు. వారి కోసం బజాజ్ ఫైనాన్స్‌తో కలిసి ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. 18 వాయిదాలతో కూడిన స్కీం కూడా ఉందన్నారు. కాగా, కంపెనీ ఈ ఏడాది 82 మోడళ్లను విడుదల చేస్తోంది. ఇన్వర్టర్ ఏసీల విభాగంలో ప్రస్తుతం 5 మోడళ్లను విక్రయిస్తోం ది. ఈ ఏడాది మరో 20 మోడళ్లను తీసుకొస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top