చర్చిలో సీఎం యోగి సేన హల్‌చల్‌

చర్చిలో సీఎం యోగి సేన హల్‌చల్‌


భందోహి: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్థాపించిన హిందూ యువ వాహినికి చెందిన కొందరు.. శుక్రవారం ఓ క్రైస్తవ ప్రార్థనా మందిరం ఎదుట ఆందోళనకు దిగారు. సంత్‌ రవిదాస్‌ నగర్‌ జిల్లా ఔరాయి తాలూకా తియూరి గ్రామంలోని ఓ ఇంటిలో చర్చి నిర్వహిస్తుండగా, యువవాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. దళితులను బలవంతంగా మతం మార్పిస్తున్నారనేది యువవాహిని ఆరోపణ.విషయం తెలుసుకున్న వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు.. చర్చి పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన ఆ పాస్టర్‌ను అజ్మన్‌ అబ్రహామ్‌గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తియూరి గ్రామంలోని ఆ చర్చిలో కొన్నాళ్లుగా మతమార్పిడులు జరుగుతున్న సంగతి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, అందుకే తామే చర్చికి వెళ్లి ఆందోళన చేయాల్సివచ్చిందని యువవాహిని జిల్లా అధ్యక్షుడు సుభాష్‌ శర్మ మీడియాకు చెప్పారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో ఓంకార్‌ సింగ్‌ యాదవ్‌ తెలిపారు.కాగా, యోగి సీఎం అయిన తర్వాత హిందూ యువవాహిని కార్యకర్తలు చర్చిల ముందు ఆందోళన నిర్వహించడం ఇది రెండోసారి. గత నెలలో మహారాజ్‌గంజ్‌లోని ఓ చర్చి వద్ద ప్రార్థనలను చేసుకుంటున్న 150 మందిని చెదరగొట్టారు. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుండగానే, నేడు అలాంటిదే మరో కేసు నమోదుకావడం గమనార్హం.

Back to Top