అది నిరూపించడం ఎలా?

పెళ్లయినట్లు నిరూపించడం ఎలా?


న్యూఢిల్లీ: దేశంలోని అన్ని మతాల ప్రజలు తమ పెళ్లిళ్లను తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ లా కమిషన్‌ వారం రోజుల క్రితం కేంద్ర న్యాయ శాఖకు ఓ నివేదికలో సిఫార్సు చేసింది. పెళ్లయిన జంట పెళ్లయిన 30 రోజుల్లో తమ పెళ్లిని స్థానిక కోర్టు లేదా మున్సిపల్‌ అధికారుల వద్ద రిజిస్టర్‌ చేయించుకోక పోయినట్లయితే 30వ రోజు నుంచి ప్రతి రోజు ఐదు రూపాయల చొప్పున జరిమానా విధించాలని కూడా లా కమిషన్‌ సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించినట్లయితే చట్టం అమల్లోకి రావడం చిన్న విషయమే.కొత్తగా పెళ్లిళ్లు చేసుకుంటున్న ఈ తరం యువతకు తమ పెళ్లిళ్లను రిజిస్టర్‌ చేయించుకోవడం పెద్ద సమస్యేమి కాదు. ఎప్పుడో పెళ్లిళ్లయిన పాతతరం తమ పెళ్లిళ్లను రిజిస్టర్‌ చేయించుకోవడమే పెద్ద తలనొప్పిగా తయారైంది. పెళ్ళిళ్లయిన వారు ముందుగా స్థానిక కోర్టు నుంచి ఓ డేట్‌ను తీసుకోవాలి. ఆ రోజున ఇద్దరు సాక్షులను వెంటబెట్టుకొని కోర్టుకు హాజరుకావాలి. తమ పెళ్లినాటి ఆహ్వానం పత్రికను, పెళ్లినాడు దిగిన ఫొటోలను సాక్షంగా చూపించాలి. వీటిని ఇప్పటికీ భద్రంగా దాచుకున్న దంపతులకు వాటిని చూపించడం, పెళ్లి సర్టిఫికెట్‌ పొందడం పెద్ద సమస్య కాదు. పెళ్లినాటి ఫొటోలను, ఆహ్వానం పత్రికను కాలగర్భంలో పారేసుకున్న దంపతులకు పెళ్లి సర్టిఫికెట్‌ పొందడం చాలా కష్టం అవుతోంది. పాస్‌పోర్టుల కోసం, జాయింట్‌గా ఆస్తుల కొనుగోలు కోసం పెళ్లి సర్టిఫెకెట్‌ అవసరమొచ్చి పడరానిపాట్లు పడుతున్న భార్యాభర్తలు దేశంలో ఎందరో ఉన్నారు.పెళ్లి సర్టిఫికెట్ల కోసం కొన్ని రాష్ట్రాల్లో ‘నిఖా నామా’ను సాక్షంగా పరిగణిస్తుంటే కొన్ని రాష్ట్రాలు పరిగణించడం లేవు. మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని మత సంప్రదాయాల ప్రకారం జరిగిన పెళ్లిళ్లను గుర్తించడం లేదు. ఇక తండాల్లో జరిగే ఆదివాసీల పెళ్లిళ్లకు సాక్షాధారాలు సేకరించడం కూడా కష్టమే. మతాలకతీతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న జంటలు కూడా సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెళ్లిళ్లను రిజిస్టర్‌ చేయాలంటూ చట్టాలు ఇప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉంటే, చట్టాలులేని రాష్ట్రాల్లో ఇంకా ఎలా ఉంటుందో!భారత దేశంలో మొట్టమొదటిసారిగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ చట్టాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌ 2004లో తీసుకొచ్చింది. బిహార్‌ 2006లో, కేరళ 2008లో తీసుకరాగా రాజస్థాన్‌ 2009లో తీసుకొచ్చింది. అయితే క్రైస్తవ, పార్శీ పద్ధతుల్లో జరిగిన పెళ్లిళ్లను రాజస్థాన్‌ చట్టం గుర్తించడం లేదు. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరిచేస్తూ ఏకరీతి చట్టాన్ని తీసుకరావాలని జాతీయ మహిళా కమిషన్‌ 2005లోనే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇలాంటి చట్టం అవసరం అంటూ ఓ విడాకుల కేసు సందర్భంగా 2006లో సుప్రీం కోర్టు కూడా సూచించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2013లో పెళ్లిళ్లను కూడా తప్పనిసరి నమోదు చేయాలంటూ పుట్టుక, మరణాల రిజిష్ట్రేషన్‌ చట్టంలో సవరణ తీసుకొచ్చింది. ఈసవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించినప్పటికీ లోక్‌సభ ఆమోదించలేకపోయింది. సభా పరిశీలనకు బిల్లు రాకముందే 2014లో లోక్‌సభ రద్దయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాత బిల్లును పునరుద్ధరిస్తుందా లేదా కొత్త బిల్లును తీసుకొస్తుందో చూడాలి. ఏదిఏమైనా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. పెళ్లి సర్టిఫికెట్‌ తీసుకోవడానికి ఆన్‌లైన్‌ సర్వీస్‌ను ఇటీవలనే ప్రారంభించామని, ఇప్పటికే తమ సైట్‌కు 87వేల జంటల దరఖాస్తులు అందాయని యూపీ ప్రభుత్వం మొన్ననే ప్రకటించింది.పాస్‌పోర్టులకు, ఉమ్మడి ఆస్తుల కొనుగోళ్లకు, బ్యాంకుల ఉమ్మడి ఖాతాలకే కాకుండా విడాకులకు కూడా పెళ్లి సర్టిఫికెట్లు అవసరమవుతున్నాయి. మొదటి భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకున్న ఓ యువతి తన రెండో భర్త నుంచి విడాకులు పొందేందుకు పెళ్లి సర్టిఫికెట్‌ అవసరమైందని ముంబయికి చెందిన లాయర్‌ వందన షా మీడియాకు తెలిపారు. పదేళ్ల క్రితం పెళ్లయిన ముంబయి రచయిత అనురాగ్‌ బక్షీ తన భార్యకు పాస్‌పోర్టు తీసుకోవడానికి పెళ్లి సర్టిఫికెట్‌ అవసరమైంది. స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఓ ఇద్దరు సాక్షులు, పెళ్లినాటి ఆహ్వానం పత్రిక, ఆనాటి ఫొటోలు తీసుకరావాలని అధికారులు చెప్పడంతో నెత్తి పట్టుకున్నారు. ఎందుకంటే ఆయన వద్ద అలాంటి సాక్ష్యాలేమీ లేవు. చివరకు పాస్‌పోర్టు ఏజెంట్‌ సలహా మేరకు నోటరీ వద్దకు వెళ్లి భార్య ఇంటిపేరును అధికారికంగా మార్పించుకోవడం ద్వారా పాస్‌పోర్టును సాధించారు. పాస్‌పోర్టు వచ్చింది కనుక ఇక తనకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని అంటున్నారు.కుటుంబ రేషన్‌ కార్డులో తన భార్య పేరును చేర్చేందుకు, ఓటరు కార్డులో ఆమె చిరునామాను మార్పించేందుకు, ఆమె పేరుతో ఆధార్‌ కార్డును తీసుకునేందుకు పెళ్లి సర్టిఫికెట్‌ లేక మహారాష్ట్ర వైద్య రంగంలో పనిచేస్తున్న రఫత్‌ ఖాన్‌ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఆయన వద్ద పెళ్లినాటి ‘నిఖా నామా’ ఉంది. అయితే పెళ్లి సర్టిఫికెట్‌ ఇవ్వడానికి అధికారులు దాన్ని సాక్ష్యంగా పరిగణించడం లేదట. ఇలాంటి వారందరి ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసినప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరగలదు. 

Back to Top