బ్రేకింగ్‌: 24న సిట్‌ విచారణకు రవితేజ

24న సిట్‌ విచారణకు రవితేజ

  • సినీ ప్రముఖులను వరుసగా విచారించనున్న సిట్‌  • హైదరాబాద్‌: సినీ పరిశ్రమకు సంబంధించి డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్నది. డ్రగ్స్‌ కేసుతో సంబంధమున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరే సిట్‌ ముందుకు రాబోతున్నారు. సిట్‌ అడుగబోయే కఠినమైన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉండి.. డ్రగ్స్ తీసుకుంటున్న పలువురు ప్రముఖులకు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఇప్పటికే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు  ఈ నెల 19 నుంచి సిట్‌ విచారణకు హాజరుకానున్నారు.    ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, 20న హీరోయిన్‌ ఛార్మీ, 21న ప్రత్యేక గీతాల నటి మొమైత్‌ ఖాన్‌, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరామ్యాన్‌ శ్యాం కే నాయుడు సిట్‌ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్‌ను ఫేస్‌ చేయబోతున్నాడు. ఈ నెల 25న ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను, 26న హీరో నవదీప్‌, 27న హీరో తరుణ్‌, 28న యువ హీరోలు తనీష్‌, నందులను సిట్‌ విచారించనుంది. పేరుమోసిన డ్రగ్స్‌ సరఫరాదారుడు కెల్విన్‌ కాల్‌లిస్ట్‌ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.    ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు మీడియా ముందుకు వచ్చి డ్రగ్స్‌ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సిట్‌ దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపారు. కాగా, డ్రగ్స్‌ వ్యవహారంలో తన కుమారుడికి సంబంధం లేదని హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి చెప్పిన సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాల కేసులో రవితేజ పేరు బయటకు రావడం తనకు బాధ కలింగించిందని ఆమె అన్నారు. రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవని, తన కొడుకు సిగరెట్‌ తాగడని, తాగేవాళ్లను ప్రోత్సహించడని ఆమె అన్నారు. రవితేజకు డ్రగ్స్‌ అలవాటు ఉందనడం అవాస్తమని, కావాలనే ఈ కేసులో అతడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు.చ మద్యం మత్తులోనే తన రెండో కుమారుడు భరత్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. చనిపోయే కొద్ది రోజుల ముందు భరత్‌ అన్ని దురలవాట్లు మానేశాడని వెల్లడించారు.

Back to Top