వాన వెల్లువ

భారీ వర్షానికి జలమయమైన చింతల్‌బస్తీ రోడ్డు


- నగరంలో కుండపోత వర్షం

- ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని వాన..

- జలమయమైన ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు

- పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్‌.. వాహనదారుల ఇక్కట్లు


- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. అన్నదాతల్లో ఆనందం.. జోరందుకున్న వరి నాట్లు

- బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌


బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రుతుపవనాలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. బేగంపేట్, మాదాపూర్, అంబర్‌పేట్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం 5.30 గంటల వరకు 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై అనేకచోట్ల నీళ్లు నిలవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. సుమారు 300 బస్తీల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది.మరోవైపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. అల్పపీడనం వాయుగుండంగా మారనుందని, దీంతో రెండ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత మూడు నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా మధిరలో 8.3 సెం.మీ. భారీ వర్షం కురిసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే జిల్లా చింతకాని, కాకరవాయిల్లో 6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. వావిలాల, ఖమ్మం, ఎర్రుపాలెం, బచ్చోడుల్లో 5 సెం.మీ. చొప్పున నమోదైంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కురవాల్సిన సాధారణ వర్షపాతం 25.34 సెం.మీ కాగా, ఇప్పటివరకు 29.32 సెం.మీ. నమోదైంది. ఈ కాలంలో సాధారణం కంటే 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో రాబోయే రెండు మూడ్రోజుల్లో చెరువులు, కుంటలు నిండే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.ఆరుతడి పంటలకు ప్రాణం

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. ముఖ్యంగా గత నెలలో సాగు చేసిన పత్తి, కంది, సోయా తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షాలు ప్రయోజనం చేకూర్చాయి. ఆరుతడి పంటలు వేశాక వారం పది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో కొన్నిచోట్ల రైతులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 56.67 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అందులో అత్యధికంగా 35.12 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ వానలు మొలక దశలో ఉన్న పంటలన్నింటికీ ప్రాణం పోశాయని వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయకుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 2.32 లక్షల (10%) ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. నాట్లు వేయడానికి ఇంకా సమయముంది కాబట్టి ఈ వర్షాలతో మరింత పుంజుకునే అవకాశం ఉంది.యూరియా.. ఏదయా?

రైతులకు అవసరమైన ఎరువులు అందజేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. పాత సరుకు అందుబాటులో ఉంచి కొరత లేదని చూపిస్తోంది. జూలై నెలకు రాష్ట్రంలో 4 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఏకంగా 7.5 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బాలూనాయక్‌ పేర్కొన్నారు. అయితే గడ్డకట్టుకుపోయిన 2.5 లక్షల టన్నుల యూరియా, డీఏపీ ఎరువులనే ప్రభుత్వ సంస్థల వద్ద అందుబాటులో ఉంచారు. రైతులు ఈ గడ్డకట్టిన ఎరువులను కొనడానికి ముందుకు రావడంలేదు. అంతేకాదు కొన్ని జిల్లాల్లో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల కొరత ఉందని ఆయా జిల్లాల నుంచి సమాచారం అందుతోంది.నిండుతున్న చెర్వులు, కుంటలు

రాష్ట్రంలో కురిసిన వర్షాలతో చెర్వులు, కుంటల్లో నీరు నిండుతోంది. మూడ్రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల ఆశలు చిగురిస్తున్నాయి. ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహాలు వస్తున్నాయి. ఆల్మట్టికి 27,447 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ జలాశయం నీటిమట్టం 1705 అడుగులు కాగా ప్రస్తుతం 1,685.23 అడుగుల్లో నీటి లభ్యత ఉంది. 48.97 టీఎంసీల నిల్వ ఉంది. మరో 80 టీఎంసీల మేర నీరొస్తే తప్ప దిగువకు నీటి ప్రవాహాలుండవు. తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి సోమవారానికి 3,410 క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఆల్మట్టికి ప్రవాహాలు మరింత పెరిగి, ప్రాజెక్టు నిండితేనే దిగువ నారాయణపూర్‌కు ఇన్‌ఫ్లో ఉంటుంది. ఇది మినహా ఇతర ప్రాజెక్టుల పరిధిలో నీటి జాడ లేదు. కృష్ణా బోర్డు ఆదేశాలతో తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి సోమవారం 8,294 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో సాగర్‌లోకి 4,238 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది.రైతుకు అందని రుణాలు..

కాలం కలిసొచ్చినా... ప్రకృతి కరుణించినా బ్యాంకులు మాత్రం రైతులకు రుణాలివ్వడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఇప్పటివరకు 50 శాతం పంటలు సాగైతే.. రుణాలు మాత్రం 20 శాతానికి మించలేదు. ఖరీఫ్‌లో రూ.23,851 కోట్ల పంట రుణ లక్ష్యానికి ఇప్పటివరకు బ్యాంకులు రైతులకు కేవలం రూ.4,681 కోట్లే ఇచ్చాయి. ఖరీఫ్‌లో 29.63 లక్షల మందికిపైగా రైతులు రుణాలు తీసుకుంటారు. అందులో ఇప్పటివరకు కేవలం 7.63 లక్షల మంది రైతులకే రుణాలు ఇచ్చాయి. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు రైతులు దాదాపు రూ.6 వేల కోట్ల వరకు ప్రైవేటు అప్పులు చేసినట్లు అంచనా. బ్యాంకుల్లో సరిపోను నగదు లేకపోవడం కూడా రైతులకు తలనొప్పిగా మారింది. కొన్నిచోట్ల రైతులకు పంట రుణాలు మంజూరు చేసినా డబ్బు లేక నగదు చేతికి ఇవ్వడం లేదు.చెరువులకు జలకళ

వర్షాలతో పలు జిల్లాల్లోని చెరువులు, రిజర్వాయర్లు జలకళం సంతరించుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్‌లో ఇప్పటిదాకా 9 అడుగుల నీరు ఉండగా.. ఇప్పుడు నీటిమట్టం 11 అడుగులకు చేరింది. సత్తుపల్లి మండలం లంకాసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 16 అడుగులు కాగా.. ప్రస్తుతం 7.3 అడుగులకు చేరింది. బేతుపల్లి పెద్దచెరువు నీటిమట్టం 17 అడుగులు కాగా.. 15 అడుగులకు నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లాయి. జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. పాల్వంచ మండలంలో బూడిదవాగు పొంగడంతో పాండురంగాపురం, సూరారం, సోములగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్‌ జిల్లాలోనూ జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది.పత్తి, సోయాబీన్‌లకు ప్రయోజనం – డాక్టర్‌ దండ రాజిరెడ్డి, సంచాలకులు, పరిశోధన విభాగం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని రకాల పంటలకు ప్రయోజనం కలుగనుంది. ముఖ్యంగా ఆరు తడి పంటలకు ఈ వర్షాలు ఎక్కువ ఉపయోగం. చెరువులు, కుంటలు నిండితే వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.వరికి సమయముంది – విజయకుమార్, అదనపు సంచాలకులు, వ్యవసాయశాఖ

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆరుతడి పంటలకు మరింత ప్రయోజనం కలుగనుంది. ముఖ్యంగా జూన్‌ రెండో వారంలో వేసిన పత్తి, కంది తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోశాయి. వరి వేయడానికి ఇంకా సమయముంది.ఎరువులకు కొరత లేదు – బాలూనాయక్, డిప్యూటీ డైరెక్టర్, వ్యవసాయశాఖ

రాష్ట్రంలో ఎరువులకు ఎక్కడా కొరత లేదు. అవసరమైన దానికంటే అదనంగానే అందుబాటులో ఉంచాం. ఈ నెల 4 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. 7.5 లక్షలు అందుబాటులో ఉన్నాయి.

Back to Top