పేదల ఇళ్ల జోలికెళితే ఖబడ్దార్
సర్కారుకు వైఎస్ జగన్ హెచ్చరిక
* నిబంధనలకు వ్యతిరేకంగా సీఎం ఇల్లు కట్టుకోవచ్చా?
* కాసింత నీడకోసం పేదలు ఇళ్లు కట్టుకోకూడదా?
* ఇళ్లు కట్టించండి లేదా పరిహారం చెల్లించండి
* అడ్డగోలుగా పేదల ఇళ్లు తొలగిస్తే ఊరుకోం
* చంద్రబాబు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు
* ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదు
* వరదలొచ్చాక కరువు మండలాలను ప్రకటించిన ఘనుడు
* వరద బాధితులకు తక్షణమే రూ.ఐదువేలు సహాయం అందించాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇళ్లు కట్టించకుండా పేదల ఇళ్ల జోలికెళితే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరు మన్సూర్‌నగర్‌లో సుమారు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి నివాసాలను కూల్చేస్తామనటం అన్యాయమని ధ్వజమెత్తారు. వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఆయన గురువారం నెల్లూరు నగరంలో పర్యటించారు.
స్థానికుల కోరిక మేరకు మన్సూర్‌నగర్‌లో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి తీరును దుయ్యబట్టారు. విజయవాడలో కృష్ణా నదీతీరాన అక్రమంగా నిర్మించారని నోటీసులిచ్చిన ప్రైవేటు గెస్ట్‌హౌస్‌నే నివాసగృహంగా మార్చుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పేదల ఇళ్ల జోలికెళ్లే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నిబంధనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకోవచ్చా? కాసింత నీడకోసం పేదలు ఇళ్లు కట్టుకోకూడదా? అని నిలదీశారు.
నెల్లూరు మునిగిపోవటానికి ఆక్రమణలే కారణమంటూ పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని తమపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. నగరంలో పంట కాలువలన్నింటినీ ఆక్రమించుకుని బడాబాబులు చాలామంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని, వారి జోలికి వెళ్లకుండా పేదల జోలికి వెళ్లటం అన్యాయమని దుయ్యబట్టారు.
పేదల ఇళ్లు తొలగించాలంటే వారికి పక్కాగృహాలు కట్టించాలని, లేదంటే మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు ఇళ్లు కూలుస్తామంటే పేదల తరఫున అడ్డుకుంటామని జగన్ హెచ్చరించారు.
చంద్రబాబు పాలనంతా మోసం
చంద్రబాబునాయుడు పాలన అంతా మోసం.. మోసం.. మోసం... అన్న పదాల చుట్టూ తిరుగుతోందని జగన్ విమర్శించారు. ‘‘చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఇంటింటికో ఉద్యోగం అన్నారు. రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు రూ.1,690 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక... ‘ఇవ్వను పో’ అని మోసం చేశారు.
ఇంటికో ఉద్యోగం మోసం.. నిరుద్యోగభృతి మోసం... రుణాల మాఫీ మోసం... ఇన్పుట్ సబ్సిడీ మోసం... చంద్రబాబు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు’’ అని దుయ్యబట్టారు. వరదలొచ్చాక కరువు మండలాలను ప్రకటించిన ఘనుడు చంద్రబాబని ఎద్దేవా చేశారు. వరదలొచ్చాక కరువు మండలాలను ప్రకటించటం వల్ల అధికారులు ఎన్యుమరేషన్‌కు వెళితే ఫలితాలు ఎలా అనుకూలంగా వస్తాయని ప్రశ్నించారు.
రూ.5వేల చొప్పున తక్షణ సాయం ఇవ్వాలి
నెల్లూరు, చిత్తూరు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో వరదలకు నష్టపోయి నిరాశ్రయులైన వారికి తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. వరదలకు పదిరోజులకుపైగా ఇళ్లు పోగొట్టుకుని నీళ్లలో నానుతున్న వారికి ప్రస్తుతం ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కొందరికి బియ్యం ఇచ్చి, మరికొందరికి ఇవ్వడంలేదని, ఇంకొందరికి తక్కువగా ఇచ్చి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరూ ఊహించని విధంగా ఊర్లు మునిగిపోయాయని, అన్నీ తెలిసి చంద్రబాబు బాధితులకు తక్షణ సాయం చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను గుర్తించటంలోనూ అన్యాయం చేస్తున్నారని, నామమాత్రపు సర్వేలు చేయిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి