వీడియో కాన్ఫరెన్సుల కోసం గూగుల్ క్రోమ్ బాక్స్

వీడియో కాన్ఫరెన్సుల కోసం గూగుల్ క్రోమ్ బాక్స్


ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ మార్కెట్ను సొంతం చేసుకోడానికి ప్రయత్నించే గూగుల్.. ఇప్పుడో సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ఇటీవలి కాలంలో బాగా ఎక్కువ కావడంతో దానికోసం ప్రత్యేకంగా గూగుల్ క్రోమ్ బాక్స్ పేరుతో ఓ కొత్త పరికరాన్ని విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నవాళ్లు నలుగురైదుగురు ఒకేసారి మాట్లాడుకోవాలంటే సెల్ఫోన్లలో కాన్ఫరెన్సింగ్ ఎటూ ఉంది. అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా మనకు ఎప్పటినుంచో తెలుసు. కానీ వాటికి కొన్ని పరిమితులున్నాయి. ఇప్పుడు వాటిని కూడా అధిగమిస్తూ గూగుల్ ఈ సరికొత్త పరికరాన్ని మార్కెట్లోకి తెస్తోంది. ముందుగా అమెరికన్ మార్కెట్లో విడుదల చేసి ఆ తర్వాత క్రమంగా విస్తరించాలని తలపెడుతోంది. 62,262 రూపాయలుగా దీని ధరను నిర్ధారించినట్లు గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా తెలిపారు.  



ఈ సంవత్సరాంతంలో ఈ క్రోమ్ బాక్సును ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, స్పెయిన్ దేశాల్లో కూడా విడుదల చేస్తారు. ఈ బాక్సులో ఒక హై డెఫినీషన్ కెమెరా, స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. దీంతోపాటు మానిటర్ కూడా అవసరం అవుతుంది. మొత్తం వీడియో కాన్ఫరెన్సింగ్ సెటప్ చేసినందుకు ఏడాదికి నిర్వహణ ఖర్చుల కింద రూ. 15,600 వసూలు చేస్తారు. ఇందులో ఒకేసారి 15 మంది వేర్వేరు ప్రాంతాల నుంచి చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. వీటికి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, లాప్టాప్లు, ఇతర ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లను కూడా అనుసంధానం చేసుకోవచ్చు. కేవలం సెర్చింజన్ గానే మిగిలిపోకుండా మరిన్ని రకాలుగా జనంలోకి వెళ్లడానికి గూగుల్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ క్రోమ్బాక్స్.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top