40 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు

40 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు - Sakshi


- ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం

- నీళ్లు, నిధులు ఉండీ సాగుకు నీరివ్వకుంటే పాపమని వ్యాఖ్య

- చెరువులను రిజర్వాయర్లుగా మార్చే అవకాశాలు పరిశీలించాలని సూచన

- గోదావరి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించిన ముఖ్యమంత్రి


- ఎస్సారెస్పీ కాల్వల ద్వారా.. 16,00,000 ఎకరాలకు..

- ఇతర ప్రాజెక్టుల ద్వారా.. 24,00,000 ఎకరాలకు..




సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రానికి వర ప్రదాయినిగా ఉన్న గోదావరి నది నీటిని సమర్థంగా వినియోగించుకుని 40 లక్షల ఎకరాలకు నీరందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కాల్వలన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి వచ్చే ఏడాది నుంచి వందశాతం ఆయకట్టుకు నీరందించాలని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ నీటిని సమర్థంగా వాడుకునే అంశంపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు.



ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గ్యాదరి కిశోర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఇందులో పాల్గొన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా 16 లక్షల ఎకరాలకు, ఇతర ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్నారు. గోదావరిలో రాష్ట్ర వాటా మేర నీటి వినియోగం జరిగేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వచ్చే ఏడాది నుంచే వాడుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. పుష్కలంగా నీటి లభ్యత ఉందని, నిధుల కొరత లేదని.. ఈ పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించలేకపోతే పాపం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.



రెండు పంటలకు నీరందాలి..

సమైక్య పాలనలో ఎస్సారెస్పీని కట్టినట్లు, నీళ్లిచ్చినట్లు మభ్యపెట్టారని... కానీ పూర్తి స్థాయిలో నీళ్లు ఎప్పుడూ ఇవ్వలేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. చివరి ఆయకట్టు దాకా నీరందక రైతులు తల్లడిల్లారని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఫలితం రైతులకు దక్కాలన్నారు. గోదావరిలో రాష్ట్రానికి 950 టీఎంసీల వాటా ఉన్నా ఎన్నడూ పూర్తిగా వాడుకోలేదని చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సైతం 500–600 టీఎంసీలకు మించి వాడుకోలేమని.. ఈ నీటితోనూ 40 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు అందించవచ్చని తెలిపారు. ‘‘ఈ లక్ష్యంతో పనిచేయాలి. రైతులు మొగులుకు (మేఘాల కోసం) మొఖం పెట్టి చూడొద్దు. కాల్వల ద్వారా వారికి రెండు పంటలకు నీరందాలి. చెరువులన్నీ ఎప్పటికీ నిండి ఉండాలి.’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.



చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలి

వచ్చే జూన్‌ నుంచి మేడిగడ్డ ద్వారా గోదావరి నీటిని తోడి.. మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీలకు పంపింగ్‌ చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. అక్కడి నుంచి పాత కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు నీరు అందుతుందన్నారు. ‘‘ఎల్‌ఎండీ దిగువ భాగంలోనే ఎస్సారెస్పీ కింద 8.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ కాల్వలు సరిగా లేవు. ఎల్‌ఎండీ నుంచి 8,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ప్రవహించేలా కాల్వలుండాలి. కానీ 6 వేల క్యూసెక్కుల సామర్థ్యం మేర మాత్రమే ఉన్నాయి. వెంటనే కాల్వల సామర్థ్యాన్ని పెంచాలి. ఇందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాళేశ్వరం నీరు అందేలోగానే.. అంటే వచ్చే ఎండాకాలం పూర్తయ్యే నాటికి కాల్వల పనులు పూర్తి కావాలి. ఈ కాల్వలు ప్రవహించే మార్గంలోని చెరువులన్నీ నింపాలి. మైలారం, రోళ్లకల్, ఫణిగిరి, కేతిరెడ్డి ఆనకట్ట, కొత్తగూడ, బయ్యన్నవాగు, మాటేడు తదితర చెరువుల సామర్థ్యం పెంచి రిజర్వాయర్లుగా మార్చే అవకాశాలను పరిశీలించాలి. పర్వతగిరి చెరువు సామర్థ్యం పెంచాలి. వీటికి సంబంధించి వారం పది రోజుల్లో అంచనాలు తయారు కావాలి. 45 రోజుల్లో టెండర్లు పిలిచి, అక్టోబర్లో పనులు ప్రారంభించి.. వచ్చే ఎండాకాలంలోపు పనులు పూర్తి కావాలి..’’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.



ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలి

దేశంలో ఎక్కడా లేని విధంగా నీటి పారుదల రంగానికి భారీగా ఖర్చు చేస్తున్నామని.. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. పనులను ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని, మంత్రులు కూడా పనులు వేగంగా జరిగేటట్లు చూడాలని చెప్పారు. కేవలం సమీక్షలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, ఏవైనా అవాంతరాలు ఎదురైతే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, కిషోర్‌ తదితరులు ముఖ్యమంత్రికి వినతులు అందజేశారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్టుకు మూలాధారమైన లక్ష్మి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలన్న ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. వరద కాలువ, ఎస్సారెస్పీ కాలువల మధ్య ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి లిఫ్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ వేగవంతం చేయాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top