ఈ ప్రముఖుడి ఆచూకీ చెబితే రూ. 5 లక్షలు

ఈ ప్రముఖుడి ఆచూకీ చెబితే రూ. 5 లక్షలు


లక్నో: గత లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయానికి, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ గెలవడానికి కారణమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మ్యాజిక్ ఉత్తరప్రదేశ్‌లో పనిచేయలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో  జతకట్టినా కాంగ్రెస్ చతికిలపడింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కిశోర్‌పైనా విమర్శలు వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కిశోర్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. ఏకంగా లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దే ఈ పోస్టర్ దర్శనిమచ్చింది. అంతేగాక ఆయన ఆచూకీ చెప్పిన వారికి 5 లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు.యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లే గెలిచింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కాంగ్రెస్ ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి. యూఫీ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్టీని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. రాహుల్‌ నాయకత్వ లక్షణాలపైనా సందేహాలు వచ్చాయి. కిశోర్‌పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాజేష్ సింగ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. కాగా కిశోర్‌పై చేసిన విమర్శలను ఆయన సమర్థించుకున్నారు. తాము పార్టీ కోసం రక్తం ధారపోస్తే, కిశోర్ తమపై స్వారీ చేశారని, ఎన్నికల్లో తమ అభిప్రాయాలను పూర్తిగా విస్మరించారని, ఓటమికి ఆయనే కారణమని నిందించారు. యూపీ ఎన్నికల సందర్భంగా ముందు కిశోర్ అభిప్రాయాలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు విభేదించారన్న వార్తలు వచ్చాయి. ఏదేమైనా నరేంద్ర మోదీ, నితీష్ కుమార్‌లను విజయపంథాన నడిపించిన కిశోర్.. యూపీ విషయంలో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు.

 

Back to Top