ఫెడ్ ట్యాపరింగ్ ఎఫెక్ట్

ఫెడ్ ట్యాపరింగ్ ఎఫెక్ట్ - Sakshi


 రెండు నెలల కనిష్టస్థాయికి సూచీలు

 సెన్సెక్స్ 149 పాయింట్లు డౌన్

 46 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ

 బ్యాంకింగ్, రియల్టీ, మెటల్

 షేర్లలో అమ్మకాలు

 

 ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీకి మరింత కోత విధించాలని (ట్యాపరింగ్) అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ సూచీలు వరుసగా ఐదో రోజూ క్షీణించాయి. గురువారం అమ్మకాల ఒత్తిడికి ఒకదశలో 300 పాయింట్లకుపైగా పతనమైన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగింపులో కొంత కోలుకుని చివరకు 149 పాయింట్ల నష్టంతో 20,498 పాయింట్ల వద్ద ముగిసింది.6,030 స్థాయివరకూ పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 46 పాయింట్ల నష్టంతో 6,074 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫెడ్ నిర్ణయంతో గత రాత్రి అమెరికా సూచీలతో పాటు గురువారం జపాన్, హాంకాంగ్, సింగపూర్, చైనా దేశాల సూచీలు 0.5-2.5 శాతం మధ్య పడిపోయాయి.

 

 బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రతీ నెలా విడుదల చేస్తున్న నిధుల్లో మరో 10 బిలియన్ డాలర్లమేర తగ్గించాలని ఫెడ్ నిర్ణయించింది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతారన్న భయాలు తాజా పతనానికి కారణమని, జనవరి డెరివేటివ్ సిరీస్ ముగింపు కారణంగా కూడా కొన్ని హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీ, బీఓఐ, కెనరా బ్యాంక్‌లు 4.5-10 శాతం మధ్య పతనమయ్యాయి. ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు ఐసీఐసీఐ, యాక్సిస్‌లు 2-3 శాతం మధ్య నష్టపోయాయి. రియల్టీ షేర్లు డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ రియల్టీలు 3.5-6.5 శాతం మధ్య పడిపోయాయి. మెటల్ షేర్లు హిందాల్కో, సేసా స్టెరిలైట్, టాటా స్టీల్‌లు 2.5-3.5 శాతం మధ్య తగ్గాయి. టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్‌లు 2-3 శాతం మధ్య పెరిగాయి.

 

 మిడ్‌క్యాప్స్ మెరుపులు...

 డెరివేటివ్ విభాగంలో ట్రేడయ్యే క్రాంప్టన్ గ్రీవ్స్, ఓల్టాస్, ఇండియా సిమెంట్స్, ఐఆర్‌బీ, అరబిందో ఫార్మాలు 3-9 శాతం మధ్య ర్యాలీ జరపగా, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, గోద్రేజ్ ఇండస్ట్రీస్, అదాని ఎంటర్‌ప్రైజెస్, యునెటైడ్ ఫాస్పరస్, ఆర్‌కామ్‌లు 4-7 శాతం మధ్య క్షీణించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 430 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. దేశీయ సంస్థలు రూ. 132 కోట్లు పెట్టుబడి చేసాయి.

 

 ఎస్‌బీఐ, డీఎల్‌ఎఫ్ కౌంటర్లలో షార్ట్ బిల్డప్..

 బ్యాంకింగ్, రియల్టీ దిగ్గజాలు ఎస్‌బీఐ, డీఎల్‌ఎఫ్ కౌంటర్లలో ఫిబ్రవరి సిరీస్‌కు షార్ట్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా సూచిస్తున్నది. ఈ రెండు షేర్లూ జనవరి సిరీస్‌లో 13%, 20% చొప్పున పతమయ్యాయి. ఇవి 52 వారాల కనిష్టస్థాయికి 5-10% దగ్గర్లో వున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఫిబ్రవరి ఫ్యూచర్ కాంట్రాక్టులో 79.92 లక్షల షేర్లు, డీఎల్‌ఎఫ్ కాంట్రాక్టులో 3.36 కోట్ల షేర్ల చొప్పున రోలోవర్ జరిగింది. ఈ రోలోవర్స్ జనవరి సిరీస్ ప్రారంభానికంటే 30% అధికం. పైగా ఈ రెండు ఫిబ్రవరి ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోనూ స్పాట్ ధరతో పోలిస్తే ప్రీమియం పూర్తిగా హరించుకుపోయింది. నిఫ్టీ 34 పాయింట్ల ప్రీమియంతో ముగిసినప్పటికీ, ఇవి జీరో ప్రీమియంతో ట్రేడ్‌కావడం షార్ట్ బిల్డప్‌కు సంకేతం. సమీప భవిష్యత్తులో ఈ షేర్లు పెరిగిన ప్రతీ సందర్భంలోనూ అమ్మకాల ఒత్తిడికి లోనుకావొచ్చు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top