రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్షలు

రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్షలు - Sakshi


రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి

వైఎస్సార్‌సీపీ రైతు విభాగ రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి పిలుపు


 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ నెల 10(గురువారం)న ‘రైతుదీక్ష’ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతుదీక్ష కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రైతులు, వ్యవసాయ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని, నిరాహార దీక్షల ద్వారా తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే మూడు ప్రాంతాల్లో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళుతుందని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వెలి బుచ్చారు. విభజనతో కోస్తాంధ్రలో భూములు ఉప్పునీటి కయ్యలుగా మారే అవకాశముందని, రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలు బీడుబారిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రాంతంలో 70 శాతం పైగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లు నిరుపయోగం అవుతాయన్నారు. అన్నపూర్ణగా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి, పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు.



రాష్ట్రం విడిపోతే అంతర్రాష్ట్ర జలవివాదాలు తీవ్రమై.. సాగు, తాగునీటి కోసం రైతులు, ప్రజలు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నారు. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో ఉన్న ఆయకట్టు అంతా ఎడారిగా మారిపోతుందన్నారు. వీటీపీఎస్, ఆర్టీపీపీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల అవసరాలకు సైతం నీరు అందక ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. మహానేత వైఎస్ సీఎం అయ్యేనాటికి రాష్ట్రంలో కేవలం 80 లక్షల ఎకరాలకే సాగునీటి వనరు లుంటే.. ఆయన జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు చేపట్టి కోటిన్నర ఎకరాలకు సాగునీరివ్వాలని సంకల్పించారని, తన పదవీ కాలంలోనే 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.


 


ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగితే మెజార్టీ ప్రాజెక్టుల నిర్మాణం నిలిచి పోయే ప్రమాదముందన్నారు. కానీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల్ని పణంగా పెట్టి రాజకీయ స్వార్థంతో తీసుకున్న ఈ విభజన నిర్ణయం వల్ల వైఎస్ కలలుకన్న హరితాంధ్రప్రదేశ్ వినాశనానికి దారి తీస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలతో కలిసి వైఎస్సార్ సీపీ మాత్రమే సమైక్య ఉద్యమం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా 10న చేపట్టే ‘రైతుదీక్ష’లో రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top