‘తెలంగాణ’పై నేడు నిర్ణయం: దిగ్విజయ్ సింగ్

‘తెలంగాణ’పై నేడు నిర్ణయం: దిగ్విజయ్ సింగ్ - Sakshi


తెలంగాణ అంశంపై మంగళవారం తుది నిర్ణయం వెలువడుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. మంగళవారం యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల సమావేశాలు ఉంటాయని తెలిపారు. అయితే ఈ సమావేశాల ఎజెండా ఏమిటో తనకు తెలియదని, తాను సమన్వయ కమిటీలో సభ్యుడిని కాదని చెప్పారు. సోమవారమిక్కడ తెలంగాణ నేతలు ఆయనతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణ అంశంపై మాట్లాడారు. తెలంగాణపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపామని తెలిపారు. అందరితో సంప్రదించామని, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఇది క్లిష్టమైన అంశమని అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇప్పుడొక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, తీసుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన రాజకీయంగా తప్పనిసరి అని, రాష్ట్రంలో ఇతర విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టాన్ని పూడుస్తుందన్న వాదన ఉందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీకి లాభమా లేక నష్టమా అన్నది ఇక్కడ ప్రధానం కాదు. అన్ని రకాల పరిస్థితులను, దేశ, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.

 

 రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర మంత్రులంతా రాజీనామా చేస్తారన్న విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. తెలంగాణపై అధిష్టానానికి ఎలాంటి నివేదికలు ఇచ్చారని విలేకరులు అడగ్గా.. తాను ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. ఇదే సమయంలో బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. 2000 సంవత్సరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ డిమాండ్‌ను తిరస్కరించిందని, కనీసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానానికి కూడా పంపలేదని చెప్పారు. ‘‘రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ శాసన సభ్యులు తెలంగాణ కోరుతూ లేఖలు ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రయత్నం చేశారు. అయితే అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినా, తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రక్రియ కొనసాగింది. అనేక సంప్రదింపులు జరిపాం. శ్రీకష్ణ కమిటీని సైతం నియమించాం. చివరగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. తెలంగాణపై ప్రకటనకు, పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

 

 తెలంగాణపై అభ్యంతరాల్లేవు: తారిఖ్

 

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు మొదటి నుంచీ తమ పార్టీ మద్దతు పలుకుతోందని, అలాగే మహారాష్ట్రలోని విదర్భ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే, తాము సమర్థిస్తామని ఎన్సీపీ నేత, కేంద్ర మంత్రి తారిఖ్ అన్వర్ చెప్పారు. తెలంగాణ అంశంపై మంగళవారం యూపీఏ సమన్వయ కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో యూపీఏ కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ నేత అన్వర్ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయానికి ముందు అన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, వివాదాలకు తావు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు.

 

 తెలంగాణ కల సాకారం దగ్గర్లోనే..

 ఆర్‌ఎల్డీ అధినేత అజిత్ సింగ్

 

 సాక్షి, న్యూఢిల్లీ:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారం  దగ్గర్లోనే ఉందని, సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కబోతోందని యూపీఏ మిత్రపక్షమైన ఆర్‌ఎల్డీ అధినేత అజిత్ సింగ్ అన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు. తెలంగాణ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మంగళవారం జరగనున్న యూపీఏ సమన్వయ కమిటీ భేటీలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు పూర్తి మద్దతు తెలుపుతానన్నారు. ‘‘ఇతర రాష్ట్రాల డిమాండ్‌ను తెలంగాణతో ముడిపెట్టకూడదు. యూపీ విభజన, విదర్భ సహా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను పరిష్కరించాలని కోరతా’’నని చెప్పారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top