ప్రియాంక వైపు.. కాంగ్రెస్ చూపు

ప్రియాంక వైపు.. కాంగ్రెస్ చూపు - Sakshi


ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ప్రతిసారీ కాంగ్రెస్ నాయకుల కళ్లన్నీ ఎవరొచ్చి తమను ఆదుకుంటారా అనే చూస్తుంటాయి. ఒక్కోసారి ఒక్కొక్కరి పుణ్యమాని గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కింది. అయితే ఇప్పుడు మాత్రం అవినీతి, కుంభకోణాలు, ధరల పెరుగుదల, రాజకీయ అనిశ్చితి.. ఇలాంటి అనేక కారణాలు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారానికి దూరం చేసేలా ఉన్నాయి. దానికి తోడు ఇంతకాలం సర్కారుకు మద్దతిస్తూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ కూడా ఇప్పుడు పక్కచూపులు చూస్తోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి అండదండలు ఉన్నా కూడా బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హవా ఎక్కడ యూపీ నుంచి తమను పూర్తిగా మటుమాయం చేస్తుందోనని కాంగ్రెస్ కలవరపడుతోంది.ఎప్పటికప్పుడు వారసత్వ రాజకీయాలపైనే ఆధారపడుతూ వస్తున్న కాంగ్రెస్ నాయకులు.. నెహ్రూ-గాంధీ కుటుంబానికి సాగిలపడటం ఈసారి కూడా మానలేదు. ఆదివారం నాడు తన 42వ పుట్టినరోజు చేసుకుంటున్న ప్రియాంకా గాంధీవైపు ఇప్పుడు వారి చూపులు పడ్డాయి. ఇంతకుముందే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని భావించినా, అప్పుడు మాత్రం అలా జరగలేదు. కానీ ఇటీవలి కాలంలో రాబర్ట్ వాద్రాతో గాంధీ కుటుంబానికి పొసగట్లేదని తెలుస్తోంది. అందుకే ప్రియాంక కూడా కాంగ్రెస్ రాజకీయాలను బాగా దగ్గరుండి గమనిస్తున్నారు. తరచు ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లడం, అక్కడి పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర అగ్రనాయకులతో సమావేశం అవుతుండటం లాంటివి కనిపిస్తున్నాయి.అమేథీ, రాయ్బరేలి నియోజకవర్గాల్లో కూడా ప్రియాంక పర్యటిస్తూ, అక్కడి పార్టీ సంస్థాగత వ్యవహారాలను కూడా ఆమె చక్కబెడుతున్నారు. కార్యకర్తలతో తరచు మాటా మంతీ జరుపుతూ వారిని ఉత్తేజితులను చేసే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. ముమ్మూర్తులా నాయనమ్మను పోలి ఉండే ప్రియాంకా గాంధీయే తమ తురుపుముక్క అని కాంగ్రెస్ అధిష్ఠానం నేతలు కూడా భావిస్తున్నారు. రాహుల్ గాంధీ మీద ఆశలు పెట్టుకున్నా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, మోడీ సభలతో పోలిస్తే ప్రజల స్పందన కూడా రాహుల్ గాంధీకి అంతంతమాత్రంగానే ఉండటం లాంటి కారణాలతో ప్రియాంకా గాంధీ రాక ఈసారి తప్పనిసరనే భావిస్తున్నారు. బర్త్డే బేబీ ప్రియాంక ఈ విషయంలో ఏమంటారో చూడాలి మరి!!

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top