ఆమె ధైర్యశాలి

ఆమె ధైర్యశాలి


బస్సులో కండక్టర్‌ అసభ్య ప్రవర్తన

 చెంప ఛెళ్లుమనిపించిన యువతి  
భువనేశ్వర్‌: బస్సులో ప్రయాణిస్తున్న తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ చెంప ఛెళ్లుమనిపించింది ఓ యువతి. ఈ  సంఘటన జంట నగరాల్లో చోటుచేసుకుంది. ఈ విచారకర సంఘటనను ఆమె సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో సోమవారం ప్రసారం చేసింది. సోషల్‌ మీడియా ప్రసారాన్ని పరిగణనలోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అనివార్యమని జంట నగరాల పోలీస్‌కమిషనరు వై. బి. ఖురానియా పేర్కొన్నారు. తక్షణమే ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టి నిందితుల వ్యవహారం తేలుస్తామని ఆయన అభయం ఇచ్చారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం వరుసగా ఇది రెండోసారి కావడంతో ఆందోళన పెరుగుతోంది.కటక్‌ మహా నగరంలో పని ముగించుకుని భువనేశ్వర్‌కు తిరిగి వస్తుండగా బస్సులో కండక్టర్‌ యువతిపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడు. తిరుగు ప్రయాణం కోసం ఎంత సేపు నిరీక్షించినా  ఖాళీ బస్సు తారసపడనందున ఆమె రద్దీగా ఉన్న బస్సులో వెనుదిరిగేందుకు నిర్ణయించుకుంది. నిలబడేందుకు వీలు లేని పరిస్థితుల్లో బస్సు కిటకిటలాడుతోంది. ఒక్కొక్కర్ని సర్దుతున్నట్లు వ్యవహరిస్తూ బస్సులో ఇతర యువతులు, మహిళా ప్రయాణికులను అభ్యంతరకరంగా తాకుతున్న పరిస్థితుల్ని బాధిత యువతి పసి గట్టింది. ఇంతలో అదే పరిస్థితి తనకు తారసపడడంతో ఆమె తక్షణమే స్పందించి సదరు కండక్టర్‌ను చెంప ఛెళ్లుమనిపించినట్లు ఫేస్‌బుక్‌లో ప్రసారం చేసింది. ఈ విచారకర సంఘటన ఈ నెల 18వ తేదీన జరిగినట్లు ఫేస్‌బుక్‌ ప్రసారంలో ఆమె పేర్కొంది. ఈ ప్రసారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇటీవల కేంద్రపడ నుంచి వస్తున్న బస్సులో వస్తున్న మహిళా పాత్రికేయురాలితో బస్సులో తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించిన సందర్భంగా కూడా ఇటువంటి దుమారమే చెలరేగింది.

Back to Top