‘సౌర’కు అపూర్వ స్పందన

‘సౌర’కు అపూర్వ స్పందన - Sakshi


4,988 మెగావాట్ల స్పందన

నూతన సౌర విధానంపై  ఆసక్తి చూపిన 101 కంపెనీలు

తక్కువ ధర సూచించిన కంపెనీలకే ప్రాధాన్యం


 

హైదరాబాద్: సౌర విద్యుదుత్పత్తి రంగంలో రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 4,988 మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తి చేసేందుకు 101 ప్రైవేటు కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. సౌర విద్యుత్ టెండర్లకు ఈ స్థాయిలో స్పందన రావడం దేశంలోనే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌స్టేషన్ల సామర్థ్యం, ప్రస్తుతం వాటికి సరఫరా అవుతున్న విద్యుత్ ఆధారంగా ఈ టెండర్లను పిలిచారు. ఉదాహరణకు 50 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటే, దానికి కేవలం 40 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంటే, లోటును పూడ్చేందుకు అక్కడి సమీపంలోనే 10 మెగావాట్ల సౌర ప్లాంట్లను నిర్మిస్తారు. దీని ద్వారా కొత్త ప్రాజెక్టుల కోసం కొత్త సబ్‌స్టేషన్‌లు, లైన్ల నిర్మాణం వ్యయ ప్రయాసాలు తప్పనున్నాయి.



 రెండు కేటగిరీలుగా టెండర్ల విభజన..

 స్థానికంగా కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను బట్టి టెండర్లను రెండు కేటగిరీలుగా విభజించారు. 15 మెగావాట్లలోపు సామర్థ్యంతో మొత్తం 500 మెగావాట్ల సౌర యూనిట్లను నెలకొల్పేందుకు పిలిచిన టెండర్లకు మొత్తం 1,246 మెగావాట్ల స్పందన లభించింది. గ్రూప్-2 కేటగిరీలో 15 మెగావాట్లకు పైగా సామర్థ్యమున్న యూనిట్ల నిర్మాణం ద్వారా 1,500 మెగావాట్ల కొనుగోళ్లకు  టెండర్లను ఆహ్వానిస్తే మొత్తం 3,742 మెగావాట్లకు స్పందన లభించింది. అంతకు ముందు 2,014 నవంబర్‌లో తొలివిడతగా 515 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం టెండర్లు పిలిచి ఆ మేరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కూడా కుదుర్చుకుంది. సగటున యూనిట్‌కు రూ.6.72 ధరతో కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందాలు జరిగాయి.



తాజాగా గ్రూప్-1 టెండర్ల ద్వారా యూనిట్ విద్యుత్‌ను గరిష్టంగా రూ.6.45కు, గ్రూప్-2 ద్వారా రూ.6.32కే అందుబాటులోకి రానుంది. అందరికంటే తక్కువ ధరను సూచించిన కంపెనీలను ఇతర అర్హతలను బట్టి ఎంపిక చేయనున్నారు. కాగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో ఇంధన శాఖ ప్రకటించిన నూతన సౌర విద్యుత్ విధానమే ఇందుకు కారణమని  దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సౌర విద్యుదుత్పత్తి, సరఫరా ప్రణాళికలు, నూతన విధానం యావత్ దేశానికి ఆదర్శనీయం కాబోతోందన్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top