పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..


- వివాహాలను పెంచేలా వినూత్నయత్నాలు

- పేరయ్యగా మారిన చైనా ప్రభుత్వం
బీజింగ్‌ :
దేశంలోని పెళ్లికాని ప్రసాదులు ఎక్కువైపోతున్నందుకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీనికి విరుగుడుగా తానే పెళ్లిళ్లు చేయించాలని కంకణం కట్టుకుంది. అవివాహితులైన యువతీయువకులను ఒకే వేదికపైకి రప్పించి పెళ్లిళ్లు కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.చైనాలో పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు పది కోట‍్ల మందికి పైగానే ఉన్నారు. పెళ్లీడుదాటుతున్నా ఒకింటి వారమవ్వాలనే వాంఛ వీరిలో కలగటం లేదు. 2010 జనాభా లెక్కల ప్రకారం 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని మహిళలు 2.74 శాతం మంది ఉన్నట్లు తేలింది. మారిన పరిస్థితులు, విధి నిర్వహణలో పోటీ వాతావరణం, కఠిన పరిస్థితుల్లో పని చేయాల్సి రావటం వంటి కారణాలతో యువత ప్రేమ-పెళ్లి ప్రస్తావన లేకుండానే బతికేస్తున్నారని వెల్లడయింది.దీంతో వీరికి పెళ్లిళ్లు ఎలా జరపాలనే దానిపై ప్రభుత్వం తీవ్ర ఆలోచనలో పడింది. ఇందుకు అనుగుణంగా అధికార కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న కమ్యూనిస్టు యూత్‌ లీగ్‌(సీవైఎల్‌)కు ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. యువతీయువకులకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అందులో కోరింది. కుటుంబ భావన సామాజిక జీవనం సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుందని, పెళ్లి ఇందులో మొదటి మెట్టని తెలిపింది. వ్యక్తిగత అభివృద్ధికి జీవిత భాగస్వామి ఉండటం అవసరమని పేర్కొంది. యువతీయువకులు ఒంటరిగా ఉండటం సామాజిక, ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని పేర్కొంది.దీనికి స్పందించిన ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌ సీవైఎల్‌ కమిటీ జూన్‌లో వివాహవేదిక ఏర్పాటుచేసింది. ఇందులో దాదాపు 5వేల మంది అవివాహితులు పాల్గొనగా కొందరికి జీవిత భాగస్వాములు దొరికారు. ఈ కార్యక్రమాల్లో కుటుంబసంక్షేమ శాఖ, మహిళా, కార్మిక సంఘాలు కూడా భాగస్వాములయ్యాయి. కొన్ని సంస్థలైతే వివాహవేదికలో పాల్గొనే వారికి సెలవు కూడా మంజూరు చేశాయని సీవైఎల్‌ ప్రశంసించింది. ప్రభుత్వం చేపడుతున్న వివాహ వేదికలను పలువురు నెటిజన్లు కొనియాడుతుండగా..వ్యక్తిగత జీవితాల్లో ప్రభుత్వ పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top