ఏనాడూ విచారణకు నిలబడని బాబు

ఏనాడూ విచారణకు నిలబడని బాబు - Sakshi


ఏ కేసులోనైనా స్టే తెచ్చుకోవడమే...

► సాంకేతిక కారణాలు చూపి బైటపడడమే..


సాక్షి, అమరావతి: ‘ఆ కేసులో ఏముంది నేను మాట్లాడటానికి, మీరే అధ్యయనం చేసి చె ప్పండి...’ ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తునకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందన ఇది.‘నేను నిప్పులా బతికాను. నీతి, నిజాయితీలే నా ఆస్తి, అందువల్లే వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నాపై  11 సభా సంఘాలు, నాలుగు న్యాయ విచారణలు, నాలుగు మంత్రివర్గ ఉపసంఘాలు, మూడు పరిపాలనా పరమైన విచారణలు, ఒక సీఐడీ  విచారణ చేశారు. ఒక్కదానిలోనైనా నిరూపించగలిగారా?’ తనపై ఎపుడు, ఏ ఆరోపణ వచ్చినా చంద్రబాబు నాయుడు వేసే ప్రశ్న ఇది.



నిజానికి చంద్రబాబు ఎప్పుడూ విచారణకు నిలబడలేదు. తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా, కోర్టులు విచారణకు ఆదేశించినా సాంకేతిక కారణాలు చూపుతూ స్టే ల కోసమే ప్రయత్నించారు. ఓటుకు కోట్లు కేసులో రెండు రోజుల కిందట గంభీరమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇపుడు హడావిడిగా హైకోర్టు తలుపు తట్టడం అటు రాజకీయవర్గాల్లో, ఇటు సాధారణ ప్రజానీకంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తప్పు చేయకపోతే దర్యాప్తు అనంతరం కడిగిన ముత్యంలా బైటకు వచ్చేందుకు దొరికిన ఒక సదవకాశాన్ని ఎందుకు ఒదులుకుంటున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు కోట్లు  కేసులో తన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చిన తరువాత ‘నీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంది, నీకు పోలీసులుంటే నాకు పోలీసులున్నారు, హైదరాబాద్‌పై  నీకు ఎంత అధికారం ఉందో నాకు కూడా పది సంవత్సరాల పాటు అదే అధికారం ఉంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేలా మాటల తూటాలు పేల్చిన చంద్రబాబు ఇపుడు దర్యాప్తు నిలుపుదల కోరుతూ కోర్టుకు వెళ్లడం అనుమానాలకు ఆస్కారమిస్తున్నదని విశ్లేషకులంటున్నారు.



 ఎవరు వద్దన్నా...

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడడం అందరూ విన్నారు. రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షల నగదు ఇస్తూ వీడియో టేపులో చిక్కుకున్నారు. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీటులో చంద్రబాబు పేరు 33 సార్లు ప్రస్తావనకు వచ్చింది. కానీ 14 నెలలు గడుస్తున్నా చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ లేకపోవడంతో అనుమానం వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పాత్రపై ఏసీబీ కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది.ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో తత్తరపాటుకు గురైన చంద్రబాబు గత మూడు రోజులుగా న్యాయనిపుణులు, పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. కోర్టులను ఆశ్రయిస్తూ స్టేల కోసం ప్రయత్నిస్తారన్న అపవాదును కొనసాగించవద్దంటూ అందరూ సూచించారని సమాచారం. అయినా వినని చంద్రబాబు చివరకు తన తరపున క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పైకి గంభీరంగా మాట్లాడుతున్న చంద్రబాబుకు వాస్తవం ఏమిటో తెలుసు కాబట్టే కోర్టును ఆశ్రయించారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

 

 వైఎస్ అలా...

పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్రను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, ఈ కేసులో మంగలి కృష్ణను అరెస్టు చేస్తే జగన్‌మోహన్‌రెడ్డి పాత్రను వెల్లడించారంటూ 1999-2004 మధ్య అధికారంలో  ఉన్న టీడీపీ  శాసనసభలో వాయిదా తీర్మానం ఇవ్వగా సభా కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసి చర్చకు చేపట్టారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ప్రతిపక్ష  నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చే యటంతో పాటు తన కుమారుడి పాత్ర ఉండి  ఉంటే  ఉరితీయండని డిమాండ్ చేశారు.



► పరిటాల రవి హత్య కేసును రాజశేఖరరెడ్డి సీబీఐకి అప్పగించటంతోపాటు తన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ  కూడా జరిపించారు.

► హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై ప్రతిపక్ష తెలుగుదేశం విమర్శలు కురిపిస్తే వైఎస్ తన నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణ జరిపించారు.

► ఫోక్స్ వ్యాగన్ కేసులో కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సీబీఐ విచారణ జరిపించారు.

 

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఏలేరు కుంభకోణం బైటపడింది. చంద్రబాబుకు ప్రత్యక్ష ప్రమేయముందని కోర్టులు ధృవీకరించాయి. అయినా ఆ కేసులో స్టే తెచ్చుకున్నారు.

► మద్యం డిస్టిలరీలకు అనుమతి వ్యవహారంలో  చంద్రబాబు  ముడుపులు తీసుకున్నారని కాంగ్రెస్‌నేత కృష్ణకుమార్ కోర్టును ఆశ్రయించటంతో ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కూడా చంద్రబాబు కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు.

► చంద్రబాబు ఆస్తులతో పాటు అవినీతిపై వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వేసిన పిటీషన్‌పై సీబీఐ విచారణకు హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కూడా చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించి ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయించుకున్నారు.

► తాజాగా ఓటుకు కోట్లు కేసులో  చంద్రబాబు పాత్రపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేయటంతో  దాన్ని క్వాష్ చేయాల్సిందిగా చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top