ఛాలెంజ్‌పై చంద్రబాబు వెనుకంజ

ఛాలెంజ్‌పై చంద్రబాబు వెనుకంజ


జగన్‌ సవాల్‌పై ముఖ్యమంత్రి కప్పదాటు వైఖరిసాక్షి, అమరావతి: ‘‘అంతగా నిరూపించుకోవాలనుంటే మిగిలిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లమనండి. వాళ్లనే పరీక్ష పెట్టుకోమనండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ‘పార్టీ ఫిరాయించిన 21 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు రావాలి. ఆ ఎన్నికలను రిఫరెండమ్‌గా తీసుకుందాం’ అన్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌పై చంద్రబాబు పై విధంగా స్పందించారు. ‘‘వాళ్లే (పార్టీ ఫిరాయించినవారు) ఎందుకు? వైఎస్సార్‌సీపీలో ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారుగా వారందరితో రాజీనామా చేయించి పరీక్ష పెట్టుకోమనండి’’ అని   వ్యాఖ్యానించారు.ప్రత్యేక హోదాపై ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ఇంతకు ముందు జగన్‌ చెప్పారని, అలా చేసినా తేలిపోతుందా? అని మరో విలేకరి ప్రశ్నించగా... ‘‘అదే ఎందుకు... ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు కదా? ఏదో ఒకసాకు చెప్పి వారితో రాజీనామాలు చేయిస్తే మంచిదే! నాయకుడినీ చేయమనండి, ఎవరేమిటో తేలిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ లేకపోయినా, వైఎస్సార్‌ కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పోటీకి అభ్యర్థులను నిలపడం అప్రజాస్వామికమని, తమ పార్టీ బీఫారంపై గెలిచి వారిని ప్రలోభపెట్టి గెలుపు సాధించారంటున్న ప్రతిపక్ష నేత జగన్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘‘వాళ్లకు బలం ఎక్కడుంది? మా వాళ్లు ప్రతి అభ్యర్థి పేరుతో జాబితా ఇచ్చారు. అసలు వాళ్లు వైఎస్సాఆర్‌ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయినా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు కదా అని అన్నారు.  పులివెందులలో పోటీకి రావాలని వైఎస్‌ జగన్‌ సవాల్‌ చేశారని మీడియా పేర్కొనగా నన్ను పోటీకి రావాలని సవాల్‌ చేశారా?  2019లోనా ఇట్స్‌ ఓకే చూద్దాం’’ అని మాట దాటవేశారు. 2019లో  పులివెందులను టార్గెట్‌గా పెట్టుకుంటామన్నారు.

Back to Top