అమ్మాయిని ఎరచూపి భారీ దోపిడీ

అమ్మాయిని ఎరచూపి భారీ దోపిడీ


– పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

 మదనపల్లె క్రైం :
అమ్మాయిని ఎరచూపి వ్యాపారి వద్ద రూ.70 వేల నగదును దొంగలు దోపిడీ చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం పట్టణం బీడీల కాలనీకి చెందిన బియ్యం వ్యాపారి కొండా బుడ్డారెడ్డి(52)కి 10 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. సీజన్‌లో పంటలు పండిస్తూ చుట్టుపక్కల రైతుల నుంచి వరిధాన్యం సేకరించి కర్ణాటకలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను గురువారం 130 బస్తాల బియ్యాన్ని కర్ణాటకలోని కోలారు జిల్లా బంగారుపేటకు తీసుకెళ్లి అక్కడ ఓ హోల్‌ సేల్‌ వ్యాపారికి రూ.71 వేలకు విక్రయించాడు. నగదుకు బిల్లులు తీసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు.అమ్మాయి ఎదురుచూస్తోందని చెప్పి...

మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో బస్సు దిగి టీ తాగేందుకు ఆవరణలోని టీస్టాల్‌కు వెళ్లాడు. అక్కడ టీ తాగుతుండగా ఇద్దరు యువకులు వచ్చి పరిచయం చేస్తుకున్నారు. తమది కూడా కడప జిల్లా అని నమ్మించి ఇక్కడికి సమీపంలోని సీటీఎం రోడ్డులో తమ ఇల్లు ఉందని చెప్పారు. ఇంటికి ఆనుకునే అన్ని సౌకర్యాలున్న ఇల్లు ఉందని, అమ్మాయితో ఒకరాత్రి గడిపేందుకు రూ.1000 ఇస్తేచాలని తెలిపారు. వారి మాటలను నమ్మిన బుడ్డారెడ్డి.. వారితో కలిసి ఆటోలో సీటీఎం రోడ్డువైపు వెళ్లారు.రూ.70 వేలు దోచుకెళ్లిన యువకులు

దేవతానగర్‌ రాజరాజేశ్వరి గుడి వద్ద ఆటో నిలపడంతో ముగ్గరూ దిగి సమీపంలోని చెట్లపొదల్లోకి వెళ్లారు. ఇద్దరు యువకులు బుడ్డారెడ్డిపై దాడిచేసి చావబాదారు. నోట్లో గుడ్డలు కుక్కి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనను చంపొద్దని అతను వేడుకోవడంతో అతని వద్ద ఉన్న రూ.70 వేలు దోచుకుని పారిపోయారు. అర్ధరాత్రి బుడ్డారెడ్డి నడుచుకుంటూ తిరిగి బస్టాండుకు చేరుకుని, జరిగిన విషయాన్ని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Back to Top