ఆ ఆలోచన లేదు: డింపుల్ యాదవ్

ఆ ఆలోచన లేదు: డింపుల్ యాదవ్


లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమిని చూసి బీజేపీ ఆందోళన చెందుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో తన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్‌తో కలసి అఖిలేష్ మాట్లాడుతూ.. పెద్దనోట్లను రద్దు చేశాక ఎంతమొత్తంలో నల్లధనాన్ని వెలికితీశారో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. యువతీ యువకులందరూ ఎస్పీకి ఓటు వేయాలని కోరారు. యూపీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి అఖిలేష్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. విడిగానూ యూపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. డింపుల్ మాట్లాడుతూ.. అఖిలేష్, రాహుల్‌తో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచన లేదని, పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. యువత సునిశితంగా ఆలోచిస్తుందని, అఖిలేష్ దూరదృష్టి ఉన్న నాయకుడని అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు బీజేపీ ఏం చేసిందని డింపుల్ ప్రశ్నించారు.

 

Back to Top