జయలలిత వారసుడిగా హీరో అజిత్ కుమార్!

జయలలిత వారసుడిగా హీరో అజిత్ కుమార్! - Sakshi


- అమ్మ వీలునామాలో రాసిందంటూ జోరుగా ప్రచారం



చెన్నై:
అనారోగ్యానికి గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ వారసుణ్ని ముందే ఎంపిక చేసుకున్నారా? వీలునామాలోనూ ఆ విషయం పేర్కొన్నారా? జయను కన్నతల్లిలా భావించే హీరో అజిత్ కుమారే ఆమె వారసుడా? అంటూ తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలోనే కాక, కొన్ని వార్తా సంస్థలు కూడా అజిత్ కుమారే జయ వారసుడని పేర్కొంటున్నాయి.



సినీ హీరోగా ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అజిత్ కుమార్.. వివాదరహితుడు, సేవాతత్పరుడేకాక సీఎం జయలలితను కన్నతల్లిగా భావిస్తారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై బాహాటంగా చెప్పారుకూడా. ఆసుపత్రిలో చేరడానికి చాలా రోజుల ముందే అజిత్ ను ఇంటికి పిలిపించుకున్న జయ.. ఏఐడీఎంకే పార్టీ వాస్తవ పరిస్థితులు, భవిష్యత్ నిర్మాణం తదితర విషయాలపై చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. అన్ని విషయాలు ఆలోచించాకే జయ.. అజిత్ ను వారసుడిగా ఎంపికచేసుకున్నారని, ఈ మేరకు వీలునామాలో రాసి ఉంచారని, ఇప్పుడా వీలునామా జయకు అత్యంత నమ్మకస్తులైనవారి దగ్గరుందని పలువురు చర్చించుకుంటున్నారు.



అంతేకాదు.. అజిత్ ఎంపిక పార్టీలోని పెద్దలందరికీ సమ్మతమేనని తెలుస్తోంది. గతంలో రెండు సార్లు అమ్మ కోసం ముఖ్యపదవిని చేపట్టిన పన్నీర్ సెల్వం పట్ల ఎలాంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టడానికి ఆయనకున్న జనాకర్షణ సరిపోదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే చాలామంది అజిత్ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.



జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సిరావడంతో ప్రస్తుతానికి పన్నీర్ సెల్వంను డిప్యూటీ సీఎంగా లేదా ఆపద్ధర్మముఖ్యమంత్రిగా నియమించి, ఒకటి రెండేళ్లలో అజిత్ ను స్వసన్నద్ధుడిగా తయారుచేయాలన్నది పార్టీ పెద్దల ఆలోచనగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై హీరో అజిత్ కుమార్ ఇప్పటివరకు స్పందిచలేదు. ఆయనేకాదు ఏఐడీఎంకేకు చెందిన ఎవ్వరుకూడా ఈ వార్తలను నిర్ధారించలేదు. మరోవైపు జయ వారసత్వం తనదేనంటూ కొడలు దీప రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వచ్చిన దీప అక్కడ కొద్దిసేపు హడావిడి చేశారు. దీంతో వారసత్వం కోసం ఓపిక పట్టాలని పార్టీ పెద్దలు ఆమెను మందలించారు. (జయ వారసత్వాన్ని ఆశిస్తోన్న దీప)



అజిత్ బ్రీఫ్ ప్రొఫైల్: సికింద్రాబాద్ లోని సింధి కాలనీలో జన్మించిన అజిత్ కుమార్ తల్లి బెంగాలీ సింధీ. తండ్రి తమిళ బ్రాహ్మిణ్. సికింద్రాబాద్ లోనే పెరిగిన అజిత్ బైక్ రైడింగ్ పట్ల ఇష్టంతో కొన్నాళ్లు మెకానిక్ గానూ పనినేర్చుకున్నాడని కొందరు చెబుతారు. అజిత్ హీరోగా అరంగేట్రం చేసింది కూడా తెలుగు సినిమాతోనే. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో 'ప్రేమ పుస్తకం' అనే సినిమా వచ్చింది. అయితే షూటింగ్ సమయంలోనే దర్శకుడు శ్రీనివాస్ దుర్మరణం చెందడంతో మిగిలిన సినిమాని మారుతిరావు తెరకెక్కించారు. ఈ కారణాల వల్ల 'ప్రేమ పుస్తకం' ఆలస్యంగా విడుదలైంది. ఈ లోపే అజిత్ కు తమిళంలో అవకాశాలు రావడం, హిట్లు పడటంతో వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. చదివింది పదో తరగతి వరకేఅయినా నాలుగు దక్షిణ భారత భాషలతోపాటు ఇంగ్లీషులోనూ అనర్గళంగా మాట్లాడగలరాయన.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top