జోన్ల కథ మళ్లీ మొదటికి

Zonal system is confused state in Telangana

రద్దుకు బదులు కొత్త జోన్ల వైపు సర్కారు మొగ్గు

కొత్తగా మరో 4.. మొత్తంగా 6 జోన్ల ఏర్పాటు?

ఏ జిల్లాలను ఎందులో చేర్చాలి

జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికగా అధ్యయనం

పరిశీలనలో వివిధ ప్రతిపాదనలు

కసరత్తు మొదలు పెట్టిన ఉన్నతస్థాయి కమిటీ

సాక్షి, హైదరాబాద్‌
జోన్ల కథ మళ్లీ మొదటికొచ్చింది. పాలనలో మూడంచెలుగా ఉన్న జోన్ల విధానాన్ని రద్దు చేసి రెండంచెల విధానాన్ని అమలు చేసేందుకు మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవ రించాలని భావించింది. ఈ మేరకు అవసరమైన అధ్యయనం చేసి నివేదికను అందించే బాధ్యతను ఉన్నతాధికారులకు  అప్పగించింది. రెండు నెలలు గడిచాక.. తీరా కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కొత్త  జిల్లాలకు అనుగుణంగా కొత్త జోన్లను ఏర్పాటు చేసే దిశగా ఇప్పుడు సమాలోచనలు చేస్తోంది. దీంతో జోన్లపై మరింత సంక్లిష్టతకు తెర లేపిన  ట్లయింది. తెలంగాణలో ప్రస్తుతం (అయిదు, ఆరు) రెండు జోన్లున్నాయి.

ఇవి పాత పది జిల్లాల భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా నిర్దేశించినవి. దీని ప్రకారం అయిదో జోన్‌లో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, ఆరో జోన్‌లో  హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం  అమల్లోకి వచ్చిన పాత జోన్ల ప్రకారమే ఉద్యోగుల నియామకాలు, బదిలీలు జరిగాయి. కానీ జోన్లను రద్దు చేస్తే.. తలెత్తబోయే  పర్యవసనాలు, సమస్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినట్లయింది. దీంతో ఇప్పటివరకు జరిగిన కసరత్తును పక్కనబెట్టిన ప్రభుత్వం జోన్లను సైతం పునర్వవ్యస్థీకరించే దిశగా ఆలోచన చేస్తోంది.

ఆరు జిల్లాలకో జోన్‌?
‘‘తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇందుకు అనుగుణంగా కొత్త జోన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా, జోన్, మల్టీజోన్, స్టేట్‌ పోస్టులను నిర్ధారించాల్సి ఉంది. కొత్త జోన్ల ఏర్పాటు కూడా అనివార్యం. ఏ పోస్టు ఏ  కేడర్‌కు చెందుతుంది? ఎన్ని జోన్లు ఉండాలి? ఏ జోన్‌ పరిధిలో ఏ జిల్లాలుండాలి? నాలుగు కేడర్ల పోస్టులు ఎలా విభజించాలి?  తదితర విషయాలపై అధ్యయనం చేయాలి..’’ అని స్వయంగా సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ దిశగా కసరత్తు కూడా వేగవం తమైంది. ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన అధ్యయన నివేదికను పక్కనబెట్టిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి  అధ్యర్యంలో మరో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. దీంతో కొత్త ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లాలున్నాయి.  గతంలో అయిదో జోన్‌లో ఉన్న కొన్ని ప్రాంతాలు ఆరో జోన్‌కు, ఆరో జోన్‌లో ఉన్న కొన్ని ప్రాంతాలు అయిదో జోన్‌తో  కలగాపులగమయ్యాయి. దీంతో పాత జోన్లు చెదిరిపోయాయి. ఉన్న జోన్లను పునర్వ్యవస్థీకరించి కొత్త జిల్లాలకు అనుగుణంగా  కొత్త జోన్లు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన.

ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లుండేవి. ఇప్పుడు తెలంగాణలోనూ కొత్తగా మరో నాలుగు  జోన్లను ఏర్పాటు చేసి మొత్తం ఆరు జోన్లను నెలకొల్పాలనే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. దీంతో హైదరాబాద్‌ మినహాయించి, 30 జిల్లాలను ఆరు జిల్లాలకో జోన్‌గా వర్గీకరించాలని, భౌగోళికంగా ఉన్న సరిహద్దులను సరిపోల్చి చిక్కులు తలెత్తకు ండా కొత్త జోన్లు నెలకొల్పాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏయే జిల్లాలను ఏ జోన్‌లో చేర్చాలనే విషయంలోనూ  ప్రాంతం వారీగా జనాభా, విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. దాదాపు 84 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం  నిర్ణయించిన నేపథ్యంలో జోన్ల సమస్య ప్రధాన అడ్డంకిగానే మారినట్టు స్పష్టమవుతోంది. కొత్త జోన్లు ఏర్పాటు చేయాలన్నా, ఉన్న  జోన్ల వ్యవస్థను రద్దు చేయాలన్నా.. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి మళ్లీ రాష్ట్రపతి ఉత్తర్వులు ఆమోదం పొందేందుకు అవ సరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయటం అనివార్యం కానుంది. దీంతో ఉన్నతస్థాయి కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే  ఉత్కంఠ నెలకొంది.

స్థానికులకు 85 శాతం రిజర్వేషన్లు
జోనల్‌ వ్యవస్థ రద్దు, కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా  కమిటీ గత నెలలోనే నివేదిక సమర్పించింది. ఉద్యోగ వ్యవస్థలో ప్రస్తుతమున్న మూడంచెల విధానానికి బదులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో  రెండంచెల విధానంలోనే పోస్టులుండేలా ఈ కమిటీ నివేదికను అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర  స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా స్థాయి పోస్టుల్లో లోకల్‌ 80 శాతం,  ఓపెన్‌ 20 శాతం.. జోనల్‌ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, మల్టీ జోనల్‌ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం  ఓపెన్‌ కేటగిరీగా పరిగణిస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగాల భర్తీకి లోకల్‌ రిజర్వేషన్‌ ఉండదు. మొత్తం ఓపెన్‌ కోటాగానే  పరిగణిస్తారు. పోస్టుల పునర్వ్యవస్థీకరణతోపాటు ఈ నిబంధనతో ఎక్కువ పోస్టులకు లోకల్‌ రిజర్వేషన్‌ వర్తించకుండా పోతుంది.  

ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సైతం వీటికోసం పోటీ పడే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు తెలంగాణ స్థానికులకు అన్యాయం  జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జిల్లాస్థాయి పోస్టుల్లో ప్రస్తుతం స్థానికులకు 80 శాతం  ఉన్న రిజర్వేషన్లను 85 శాతానికి పెంచాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 780 రకాల ఉద్యోగాలు  జోనల్, మల్టీ జోనల్‌ పోస్టులుగా ఉన్నాయి. వీటిలో 600 పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా మార్చి, మిగిలిన 180 పోస్టులను జిల్లా  కేటగిరీగా మార్చాలని కమిటీ సూచించింది. రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో స్థానికత, రిజర్వేషన్లపై న్యాయ శాఖ సలహా తీసుకోవాలని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top