ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి 

YSRCP Leaders Demand To Full Fill The Jobs - Sakshi

నేటి నుంచి సంతకాల సేకరణ

గడపగడపకూ వైఎస్సార్‌ సీపీ 

పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు  బొబ్బిలి సుధాకర్‌రెడ్డి 

షాద్‌నగర్‌ టౌన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా యాభైవేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌  నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగాలు కల్పిస్తామని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని యువతకు హామీలు ఇచ్చారని తెలిపారు. యువత, నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగు పడుతాయని భావించిన వారికి నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. యువత ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగాలు లభించక తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ  ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈవిషయమై ఇటీవల కలెక్టరేట్‌ ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించామని అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారని, వారి బతుకులతో చెలగాటం ఆడితే ఎన్నికల సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిరుద్యోగులకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. వైఎస్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలు సర్కారు పథకాలతో లబ్ధిపొందారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ అందజేత, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి ఇంటి గడపగడపకు వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. కళాశాలలు, విద్యాసంస్ధల్లో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో నేటినుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి పత్తి సంతోష్, నాయకులు పాండు, శ్రీను, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top