అందరం ఒక్కటై పోరాడుదాం

ys jagan   solidarity    Bandh - Sakshi

బంద్‌కు వైఎస్‌ జగన్‌ సంఘీభావం

 ప్లకార్డు ప్రదర్శిస్తూ విద్యార్థులతో కలిసి ఆందోళన

 ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవనే..

ప్రజా సంకల్ప యాత్ర శిబిరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయానికి నిరసనగా వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజలంతా ఒక్కటై పోరాడాలన్న ఉద్దేశంతో గురువారం ఆయన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని జువ్వలగుంటపల్లి వద్ద తాను విడిది చేసిన శిబిరం నుంచి గురువారం ఉదయం బయటకు వచ్చిన జగన్‌.. కావలి ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘ప్రత్యేక హోదా – ఆంధ్రప్రదేశ్‌ హక్కు’ అనే ప్లకార్డును ప్రదర్శిస్తూ విద్యార్థులతో మమేకం అయ్యారు. అడ్డగోలు విభజనతో అన్ని విధాలా అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఒక సంజీవని లాంటిదని జగన్‌ అన్నారు. యువత ముందుండి పోరాడితే ప్రత్యేక హోదా సాధించడం కష్టం కాదని, హోదా వస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడతాయని చెప్పారు. దీంతో కష్టపడి చదువుకున్న విద్యార్థుల శ్రమ సార్థకమయ్యేలా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.

హోదా సాధన కోసం తాము గట్టిగా పోరాడుతామని ఈ సందర్భంగా విద్యార్థులు జగన్‌కు చెప్పారు. హోదా కోసం తాము చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతామని, విద్యార్థులు ఇలా ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నానని జగన్‌ అన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆత్మకూరు, కావలి, నెల్లూరు(రూరల్‌) ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలు కూడా ప్లకార్డులు చేతబూని బంద్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. ‘మీ కేసుల మాఫీ కోసం మా ప్రయోజనాలను తాకట్టు పెడతారా?’, ‘ప్రత్యేక హోదా బిక్ష కాదు.. అది ఆంధ్రుల హక్కు’, ‘ ప్రత్యేక హోదా ఆంధ్రులకు సంజీవనే!’ అని రాసిన ప్లకార్డులను పట్టుకుని విద్యార్థులు నిరసన తెలిపారు.

ప్రజల ఆవేదనను ప్రతిబింబించింది
రాష్ట్రబంద్‌పై ప్రతిపక్షనేత జగన్‌ ట్వీట్‌

గురువారం జరిగిన రాష్ట్రబంద్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదనను ప్రతిబింబించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీటర్‌లో పేర్కొన్నారు. బంద్‌కు సహకరించిన అన్నివర్గాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని, పార్లమెంట్‌ ద్వారా లభించిన ఈ హక్కును సాధించుకునేంతవరకు పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top