విధి మిగిల్చిన విషాదం

Young Man Died With Current Shock Nalgonda - Sakshi

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

నాలుగేళ్ల క్రితమే తల్లిదండ్రులు..

ఒంటరైన ఒక్కగానొక్క తమ్ముడు

కన్నీరుమున్నీరైన గ్రామస్తులు

చింతపల్లిలో విషాదం

నాలుగేళ్ల క్రితమే కన్నవారిని పోగొట్టుకొని అనాథలయ్యారు ఆ సోదరులు.. నిలిచేందుకు నిలువ నీడా కూడా లేదు.. అన్న కరెంటు రిపేర్‌ చేస్తూ తమ్ముడిని పోషిస్తున్నాడు.. తల్లిదండ్రులను కోల్పోయి నా అనే వారు లేకుండా విధివంచితులుగా బతుకీడుస్తున్నారు.. ఓ వ్యవసాయ పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అన్న మృతి చెందడంతో తమ్ముడు ఒంటరివాడయ్యాడు. చింతపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. 

సాక్షి, చింతపల్లి (నల్గొండ) :  మండల కేంద్రానికి చెందిన చింతపల్లి విష్ణు, భాగ్యమ్మ దంపతులకు సాయి, ప్రవీణ్‌ ఇద్దరు కుమారులు. తల్లి దండ్రుల అకాల మృతితో అన్న సాయి కరెంటు మరమ్మతు పనులు చేస్తూ తమ్ముడిని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే సాయి(20) ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌ సరఫరా సరిగా లేదని గమనించిన సాయి నేరుగా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గుౖరై అక్కడికక్కడే మృతిచెందాడు.  గమనించిన స్థానికులు అతడిని దేవరకొండ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయి మృతిచెం దినట్లు వైద్యులు తెలి పారు. సాయి తమ్ముడు ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

నాలుగేళ్ల క్రితం.. 
చింతపల్లి విష్ణు, భాగ్యమ్మ దంపతులకు కూలీ లుగా జీవనం సాగించే వారు. తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి భాగ్యమ్మ మూడేళ్లుగా చెరువుగట్టు దేవస్థానంలో ఉంటూ అక్కడే అనారోగ్యానికి గురై మృతి చెం దింది. వీరికి కనీసం ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదు. దీంతో తల్లిదండ్రుల మృతదేహాలను గ్రామంలోని శివాలయం సమీ పంలో టెంటు వేసి దహనసంస్కారాలు నిర్వహించా రు. ప్రస్తుతం సాయికి నా అనే వాళ్లు ఎవ రూ లే రు.  నేరుగా శ్మశానవాటికకే మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

గ్రామస్తుల ఆందోళన 
మండల కేంద్రంలోని సమీపంలో సాయి మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు దేవరకొండలోని బంధువుల సహాయంతో సోమవారం వ్యవసాయ క్షేత్రానికి సాయి మృతదేహాన్ని తీసుకొచ్చి న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ గౌరినాయుడు ఘటన స్థలానికి చేరుకొని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీనివ్వడంతో సమస్య సద్దుమణిగింది.

అందుబాటులో ఉండని విద్యుత్‌ అధికారులు 
మండల కేంద్రంలో విద్యుత్‌ అధికారులు అందుబాటులోఉండని కారణంగానే విద్యుత్‌ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ సిబ్బంది హైదరాబాద్‌లో ఉంటుండడంతో విద్యుత్‌ మరమ్మతులు చేసేందుకు ఎవరూ అందుబాటులో ఉండని కారణంగా ప్రైవేట్‌ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. సాయి మృతికి విద్యుత్‌ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మరమ్మతులు చేయాలని విద్యుత్‌ అధికారులను కోరినా స్పందించక పోవడంతోనే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి నట్లు వ్యవసాయ క్షేత్రం యజమాని పేర్కొంటున్నాడు.

కంటతడి పెట్టిన గ్రామస్తులు 
మండల కేంద్రానికి చెందిన సాయి మృతితో గ్రామస్తులు కంటతడి పెట్టారు. సాయికి ఉన్న ఒక్కగానొక్క ప్రవీణ్‌ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. ప్రవీణ్‌కు నా అనే వారు లేకపోవడంతో గ్రామస్తులు ఒకింత ఉద్వేగానికి గురయ్యారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top