నృసింహుడి దర్శనానికి.. మార్గం సులువు

నృసింహుడి దర్శనానికి.. మార్గం సులువు - Sakshi


యాదగిరికొండ, న్యూస్‌లైన్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్దకు భక్తులు వెళ్లేందుకు వీలుగా చేపట్టిన రెండో ఘాట్‌రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ.28కోట్లతో చేపట్టిన ఈ పనులను తొందరగా పూర్తిచేయించాలని దేవస్థానం అధికారులు యోచిస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయితే భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తెలంగాణ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రం రాష్ట్ర రాజధానికి అతి చేరువలో ఉండడం వల్ల ప్రతి సెలవు రోజున సుమారు 80వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. శని, ఆదివారాలు, పండగ రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది.

 

 ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డుపై ట్రాఫిక్ అధికంగా ఉంటుంది.  కొండపైన వాహనాలకు పార్కింగ్ లేని కారణంగా పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి కింది నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను తులసీ కాటేజీలో నిలిపి కాలినడకన కొండకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు ఆటోలో గానీ దేవస్థానం బస్సులోగానీ దర్శనానికి వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్కోసారి కెపాసిటీ కంటే ఎక్కువ మందిని ఎక్కించుకుని ప్రమాదాల బారిన పడిన  సంఘటనలు లేకపోలేదు.

 

 పమాదాలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు రెండో ఘాట్ రోడ్డు నిర్మించాలని ప్రజాప్రతిని దులు, అధికారులు ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. దీంతో దీని నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.28 కోట్లు మంజూరు చేశాయి. వీటిలో కేంద్రం నుంచి 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40 శాతం, దేవస్థానం నుంచి 10శాతం నిధులు మంజూరయ్యాయి. కేఎన్‌ఆర్ కాంట్రాక్ట్ సంస్థ పనులు దక్కించుకుంది. ఈ ఏడాది మార్చి 4న పనులకు సంబంధించిన అగ్రిమెంట్ అయ్యింది. కాగా అదే నెలలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఘాట్‌రోడ్డు పనులు 2015 సెప్టెంబర్ 4వ తేదీలో గా పూర్తి చేయాల్సి ఉంది. 100 మంది కూలీలు, రోడ్లు భవనాల శాఖకు చెందిన నలుగురు ఇంజినీర్ల పర్యవేక్షణలో ఈ పనులు చకచకా కొనసాగుతున్నాయి.

 

 చేయాల్సింది ఇలా..

 ఈ రెండో ఘాట్ రోడ్డులో ప్రధానంగా రెండుదారులు ఏర్పాటు చేయనున్నారు. మొదటి దారిని కొండపైకి వెళ్లేందుకు రెడ్డి సంక్షేమ సంఘానికి ఎదురుగా ఏర్పాటు చేస్తున్నారు. రెండో దారిని కొండపై నుంచి కిందికి వచ్చేందుకు వీలుగా గోశాల నుంచి ఏర్పాటు చేయనున్నారు. నాలుగు మలుపులతో కూడిన ఈ రెండో ఘాట్ రోడ్డుకు ఇరువైపులా చిన్న ప్రహరీని నిర్మించనున్నారు. అలాగే కొండపైన సుమారు 2వేల వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు.

 

 పనులు ఇలా..

 కొండపైకి వెళ్లేందుకు 970 మీటర్ల పొడవు,11 మీటర్ల వెడల్పుతో రహదారిని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మట్టి రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఇక 200 మీటర్ల మేర కాంక్రీట్ వేసే పనులు చేపట్టారు. కాగా కొండపై నుంచి కిందికి వచ్చేందుకు వీలుగా గోశాల నుంచి ఏర్పాటు చేయనున్న రహదారి పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. వచ్చే జనవరిలోగా ఈ రోడ్డు పనులు పూర్తిచేసి దేవస్థానానికి అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top