మహిళ దొంగ అరెస్టు!

Women Thief Arrested And Seized Rs 8 Lakh In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం క్రైం :  ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సంవత్సరాలుగా ఖమ్మం నగరంలో చోరీలు చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మహిళా దొంగను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆమె వద్ద నుంచి రూ.8.33,400ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ఖమ్మం రూరల్‌ మండలం దానవాయి గూడేనికి చెందిన శీలం నిర్మల సవరాలు అమ్ముతూ జీవిస్తూ అదేవిధంగా దొంగతనాలకు అలవాటు పడింది. దీంతో ఖమ్మం నగరంలో 2015 నుంచి దొంగతనాలు చేయటం ప్రారంభించింది.
 
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌.... 
సవరాలు అమ్మే నిర్మల  నగరంలో సవరాలు అమ్ముతా అంటూ వీధుల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా పెట్టుకొనేది. ఎవరూ లేని సమయం చూసి తాళం పగులగొట్టి ఇంట్లో జొరబడి బంగారం, వెండి, నగదు దోచుకొని పోయేది. 2015 నుంచి ఇప్పటి వరకు 15 ఇళ్లలో చోరీలు చేసింది. పోలీసులు ఇది బయట నుంచి వచ్చి చేస్తున్న ముఠా సభ్యులని, లేదా దొంగతనాలలో ఆరితేరిన వారి పనిగా భావించటంతో ఆమె మరింత సులువుగా దొంగతనాలు చేయటం ప్రారంభించింది. అలా పోలీసుల కళ్లుగప్పి నాలుగు సంవతర్సాల నుంచి దొంగతనాలు చేస్తోంది. 

ఇలా చిక్కింది..  
నిర్మల భర్త పోచయ్య  గతంలో దొంగతనాలు చేసేవాడు. పోలీసుల నిఘా పెరగటంతో పోచ య్య దొంగతనాలు మానేసి తన భార్య చేత దొంగతనాలు చేయించటం ప్రారంభించాడు. అయితే పోలీసుల కళ్లుగప్పటానికి అతను పోలీసులకు పలు సమాచారాలు అందజేసేవాడు. దీంతో పోలీసులకు నిర్మలపై అనుమానం రాలేదు.  ఇటీవల రోటరీనగర్‌లో ఒకేసారి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడినప్పుడు ఒక ఇంట్లో సీసీ కెమెరాలో నిర్మల చోరీకి పాల్పడి వెళుతున్న దృశ్యాలు పోలీసులకు లభ్యం అయ్యాయి. దీంతో ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం ఆమెను గాంధీచౌక్‌ ప్రాంతంలో సంచరిస్తుండగా పట్టుకున్నారు.

ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవహారం అంతా బయటపడింది. ఆమె వద్ద నుంచి 255 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మల ఇంట్లో సుమారు లక్ష రూపాయల విలువ గల మంచం, ఇతర విలువైన వస్తువులు చూసి పోలీసులు అవాక్కయినట్లు తెలిసింది.      

పోలీసులకు రివార్డులు 
మహిళా దొంగను పట్టుకున్న సీసీఎస్‌ ఏసీపీ జహంగీర్, నగర ఏసీపీ వెంకట్రావ్, సీఐలు షుకూర్, నరేందర్, సాయిరమణ, రమేష్, వసంతకుమార్, ఏఎస్‌ఐ కృష్ణారావు, హెడ్‌కానిస్టేబుళ్లు లతీఫ్, వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు హరీష్, నాగేశ్వరరావు, మంగత్యా, అమీర్, నరేష్, జమలయ్య, నాగేశ్వరరావుకు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు మురళీధర్, పూజ తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top