గ్రామం విడిచి వెళ్లిన బాధిత కుటుంబం

Women Molested By Leader And He Demands Abortion In Nizamabad - Sakshi

షరతు విధించిన టీఆర్‌ఎస్‌ నాయకుడు

తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): యువతిని మోసం చేసి గర్భవతిని చేసిన అధికార పార్టీ నాయకుడు తప్పించుకునేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నాడు! ‘ఆడతనానికి’ రూ. 6 లక్షల ఖరీదు కట్టిన సదరు నాయకుడు.. ఇప్పుడు మాట మార్చేందుకు యత్నిస్తున్నాడు. అబార్షన్‌ చేసుకున్న తర్వాతే డబ్బులు చెల్లిస్తానని కొత్త షరతు పెట్టాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను కలవాలని నిర్ణయించారు. ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత ఒకరు.. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని మభ్యపెట్టి లోబర్చుకుని గర్భవతిని చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏర్గట్ల పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆదివారం రాత్రి కొందరు పెద్దలు పంచాయితీ పెట్టి బాధితురాలికి రూ.6 లక్షలు చెల్లించాలని రాజీ కుదిర్చిన విషయం విదితమే. (శీలం ఖరీదు రూ.6 లక్షలు)

అయితే, అదే రాత్రి 11 గంటల సమయంలో మరో డ్రామా చోటు చేసుకుంది. డబ్బు చెల్లించే విషయంలో నిందితుడు మెలిక పెట్టాడు. ముందుగా యువతికి అబార్షన్‌ చేయించాలని, ఆ తర్వాతే తాను డబ్బు చెల్లిస్తానని కండీషన్‌ పెట్టడంతో బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులు చెప్పులతో దాడి చేశారు. పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఇలా చేయడం తగదని పోలీసులు ఇరు వర్గాల వారిని హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు. అయితే, గ్రామంలో ఉంటే అధికార పార్టీ నాయకుడితో తమకు ప్రమాదముందని భావించిన బాధితురాలి కుటుంబం రాత్రికి రాత్రే గ్రామం విడిచి వెళ్లినట్లు తెలిసింది. మరోవైపు, న్యాయం కోసం పోలీసు కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులను కలవాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు, నాయకుడి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇదే విషయమై స్థానిక ఎస్సై హరిప్రసాద్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని బదులిచ్చారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top