నిరుద్యోగులను నిండా ముంచారు

Wisdom jobs dot com gharana fraud In the name of jobs - Sakshi

ఉద్యోగాల పేరిట విజ్‌డమ్‌ జాబ్స్‌ డాట్‌ కామ్‌ ఘరానా మోసం

ఇండియాతోపాటు 26 దేశాల్లో బాధితులు

నిరుద్యోగుల నుంచి రూ.70 కోట్లు వసూలు

హైదరాబాద్‌: ఇది ‘తెలివైన’ మోసం. ఘరానా టోకరా. ఉద్యోగాల పేరిట విజ్‌డమ్‌ డాట్‌ కామ్‌ నిరుద్యోగులను నిండా ముంచి.. కోట్లాది రూపాయలు కాజేసింది. కేసు వివరాలను శుక్రవారం ఇక్కడ సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. ప్రకాశం జిల్లా పరుచూరుకు చెందిన అజయ్‌ కొల్లా బీటెక్‌ చదివి 2009లో విజ్‌డమ్‌ ఐటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో కార్యాలయాన్ని నెలకొల్పాడు. 2011లో రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో జాబ్‌ సర్వీసెస్‌ నమోదు చేశాడు. విజ్‌డమ్‌ జాబ్స్‌ డాట్‌ కామ్, విజ్‌డమ్‌ జాబ్స్‌ గల్ఫ్‌ డాట్‌ కామ్‌ పేరిట 2 పోర్టల్స్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ కార్యాలయం సైబర్‌ టవర్‌లోని 7వ అంతస్తులో ఉంది. రెజ్యూమ్‌ ఫార్వర్డ్‌ సహా పలు దశల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని ఏడుకొండలు అనే బాధితుడు ఈ నెల 21న ఫిర్యాదు చేశారు.

సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా దేశంతోపాటు మిడిల్‌ ఈస్ట్‌ కు చెందిన 26 దేశాలకు చెందిన లక్షా నాలుగు వేల మంది నిరుద్యోగుల నుంచి రూ.67 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. విజ్‌డమ్‌ జాబ్స్‌ డాట్‌కామ్, జాబ్స్‌ గల్ఫ్‌ డాట్‌ కామ్‌ డైరెక్టర్, సీఈవో అజయ్‌ కొల్లాతోపాటు కన్జూమర్‌ రెడ్రసల్‌ సయ్యద్‌ మజార్, ఆపరేషన్స్‌ హెడ్‌ రోహిత్, టీమ్‌ లీడర్లు బస్వరాజ్‌ నయకొడి, గోపీనాథ్‌ సురెడ్డి, రాజేశ్, శభం కుమార్‌ సింగ్, సామ్రాట్‌ పండుగుల, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ నిఖిత జైన్, మాధురి వీపురి, టీమ్‌ లీడర్లు వై.కార్తీక్‌ కుమార్, షమికాంత్‌ కంకమనేని, శ్రీకాంత్‌ గాటోజు, ఆపరేషన్స్‌ హెడ్‌ రవి కిరణ్‌లను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అజయ్‌ కొల్లాకు చెందిన బ్యాంకుల్లో రూ.23 లక్షల నగదు సీజ్‌ చేశారు. కేసును ఛేదించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ జానకీషర్మిల, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు రామయ్య, విజయ్‌ వర్థన్, ఎస్‌.వెంకట్‌రెడ్డి, వై.వెంకట్‌రెడ్డి, రవీందర్‌ పాల్గొన్నారు.

స్మార్ట్‌గా మోసం: గల్ఫ్‌లోని పెద్ద కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్‌ హెడ్‌ అని చెబుతూ సెల్‌ఫోన్‌లో ఫేక్‌ ఇంటర్వ్యూలను విజ్‌డమ్‌ జాబ్స్‌ డాట్‌ కామ్‌కు చెందిన ఉద్యోగులు నిర్వహిస్తారు. రావన్‌ జనరల్‌ పెట్రోలియం హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అంజేలా బోస్‌ను అంటూ ఎగ్జిక్యూటివ్‌ నిఖిత జైన్‌ ఏడుకొండలు అనే నిరుద్యోగిని ఇంటర్వ్యూ చేసి జాబ్‌కు సెలక్ట్‌ అయ్యావని, వెంటనే సెక్యూరిటీగా 525 డాలర్లు చెల్లించాలని చెప్పారు. బాధితుడు అనుమానించి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో విజ్‌డమ్‌ జాబ్స్‌ డాట్‌కామ్‌ ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని పోలీసులు తెలిపారు. ఇండియా పోర్టల్‌లో 2.85 కోట్ల మంది నిరుద్యోగులు, గల్ఫ్‌ పోర్టల్‌కు 25 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. దేశంలోని 69వేల నిరుద్యోగుల నుంచి రూ.27.94 కోట్లు, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు చెందిన 25 వేలమంది నిరుద్యోగుల నుంచి రూ.39 కోట్లు వసూలు చేశారు.

ఇలా ఉచ్చులోకి దింపుతారు..
ఫ్రీ రిజిస్ట్రేషన్లను పరిశీలించాక సర్టిఫికెట్లు చూసి కొందరిని ఎంపిక చేసుకుంటారు. రెజ్యూమ్‌ ఫార్వర్డ్‌ చేసేందుకు 150 అమెరికా డాలర్లు, రెజ్యూమ్‌ సరిగ్గా లేదని చెప్పి 250 నుంచి 500 డాలర్లు, రెజ్యూమ్‌ హైలైటింగ్‌ పేరిట 250 డాలర్లు దండుకుంటారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పేరిట 50 డాలర్ల నుంచి 150 డాలర్లు వసూలు చేస్తారు. జాబ్‌కు సెలక్ట్‌ అయ్యావని చెప్పి ఫైనల్‌గా 500 నుంచి 700 డాలర్లు దండుకుంటారు. మన దేశ నిరుద్యోగుల నుంచి రూ.లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేశారు.

డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి
ఉద్యోగాల కోసం డబ్బుల అడిగే కంపెనీల నమ్మవద్దని, ఐటీ ఉద్యోగాలతోపాటు ఏ ఉద్యోగాలకైనా డబ్బులు అడిగితే 9491617444 వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సజ్జనార్‌ సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top