ఇది తెలంగాణ రైతుల కలల ప్రాజెక్టు

will give water for each acre, says CM KCR at Kaleshwaram project - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించండి : సీఎం కేసీఆర్‌

ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని ఉద్ఘాటన

రైతులు వర్షాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దు

అవసరం ఉన్న ప్రతీచోట చెక్‌డ్యాంలు కట్టండి

ప్రాజెక్టుల పనులు ఈ సీజన్‌లోనే పూర్తి కావాలి

కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగాలు, పంప్‌హౌస్‌ల సందర్శన

మిడ్‌మానేర్‌పై ఏరియల్‌ సర్వే

ఉత్తర తెలంగాణలో ముగిసిన మూడ్రోజుల పర్యటన

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ :  ‘‘మీ అందరికీ తెలుసు.. మన లక్ష్యం బంగారు తెలంగాణ.. ఇందుకు ప్రాజెక్టుల నిర్మాణమే కీలకం.. రైతుల ఆశలు, ఆకాంక్షలకు ప్రాజెక్టులు ప్రతిరూపాలు. నా సంకల్పం అర్థం చేసుకోండి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల పనుల్లో వేగం తగ్గితే అనుకున్న గడువులో నీళ్లివ్వడం కష్టం. తెలంగాణ రైతుల కలల ప్రాజెక్టు ఇది. కాళేశ్వరం పనుల్లో మరింత వేగం పెంచండి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ‘‘మేకిట్‌ ఫాస్ట్‌.. ప్రాజెక్టుల పనులు ఈ సీజన్‌లోగా పూర్తి చేయాలి..’’అంటూ దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో రైతులు వర్షం కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతీ ఎకరాకు నీరందించేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు, కాల్వల నిర్మాణాల పనులను పరిశీలించారు. నంది మేడారం నుంచి మల్యాల మండలం రాంపూర్‌ పంప్‌హౌస్‌ వరకు అన్ని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోహిణి కార్తెలోనే నాట్లు పడేలా కార్యాచరణ ఉండాలన్నారు. డిసెంబర్‌–మార్చిలోపే యాసంగి పంటల ప్రక్రియ పూర్తయ్యే విధంగా రైతులకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌లు అన్ని పూర్తి కాగానే వచ్చే జూన్‌ నుంచి గోదావరి బేసిన్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న చెరువులు, కుంటలను యుద్ధ ప్రాతిపదికన నింపాలని సూచించారు. ఎక్కడా సాగునీరు అందని భూములు లేకుండా ఉండేలా గోదావరి బేసిన్‌లోని నదులు, కాల్వలు అన్నింటిపై చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయడానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. మానేరులో 4 నుంచి 5, మూలవాగులో 2 నుంచి 3 వరకు ఇలా.. అవసరం అనుకున్న ప్రతిచోట చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని పేర్కొన్నారు. దేవాదుల నుంచి వరంగల్‌ జిల్లా మొదలుకొని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు సాగునీటిని అందించేలా చూడాలన్నారు. వ్యవసాయం తర్వాత చేపల పెంపకం అతిపెద్ద రంగంగా నిలుస్తుందన్నారు.

నేడు కాళేశ్వరంపై సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై శనివారం ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద భోజన విరామం తర్వాత కొద్దిసేపు అధికారులతో మాట్లాడిన సీఎం.. వర్కింగ్‌ ఏజెన్సీలు, అధికారులు, కలెక్టర్లు ఈ సమీక్షకు హాజరు కావాలని ఆదేశించారు.

చేస్తారా.. తప్పుకుంటారా!
‘పనులు త్వరగా చేస్తారా..? లేదంటే పనుల నుంచి తప్పుకుంటారా..? మీ వల్ల కాదంటే చెప్పండి.. పనుల నుంచి తప్పుకోండి.. జాప్యా న్ని సహించేది లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సిందే..’అని సీఎం కేసీఆర్, మంత్రి హరీ శ్‌ అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. ఎన్టీపీసీ అతిథిగృ హంలో గురువారం రాత్రి, శుక్రవారం ఉద యం ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్లు, అధికారులతో వీరిరువురు ఏడెనిమిది గంటల పాటు సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  

సొరంగాలు, పంప్‌హౌస్‌ల సందర్శన
పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి బయల్దేరిన సీఎం నందిమేడారం (ప్యాకేజీ6), కరీంనగర్‌ జిల్లా రామడుగు (ప్యాకేజీ8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్‌హౌస్‌లను, సర్జిపూల్స్‌ను, సబ్‌స్టేషన్లను, స్విచ్‌యార్డులను పరిశీలించారు. ఎల్లంపల్లి నుంచి 9.53 కి.మీ. సొరంగ మార్గం ద్వారా నీళ్లు నందిమేడారం పరిధిలోని భూగర్భ సర్జిపూల్‌కు చేరతాయి. ఈ సొరంగం నిర్మాణ పనులన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించారు. ఇక్కడ 124.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 పంప్‌లను ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సీఎంకు వివరించారు. అటవీ ప్రాంతం, కొండలు గుట్టలున్న ప్రాంతం కావడంతో మేడారంలో 400 మెగావాట్ల సామర్థ్యంగల సబ్‌స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించినట్లు వివరించారు. పంప్‌సెట్ల తయారీ బాధ్యతలు తీసుకున్న బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో కూడా సీఎం మాట్లాడారు. వేసవిలోగా అన్ని పనులు పూర్తిచేసి నీటి లిఫ్ట్‌కు, పంపింగ్‌కు సిద్ధం కావాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.

మేడారం, లక్ష్మీపూర్‌ ద్వారా లిఫ్ట్‌ చేసిన నీటిని వరద కాల్వలో 99వ కిలోమీట ర్‌ వద్ద కలపాలని చెప్పారు. ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయడానికి ఏర్పాట్లు చేయాలని, వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంత మేర నీటిని గోదావరి నుంచి తీసుకోవాలన్నారు. వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీ నీటిని మిడ్‌మానేరుకు పంపాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవం పనులపై ఆరా తీశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. అందులో భాగంగా మొదటి విడత 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణం ప్రారంభమైంది. ఈ పనులను కూడా కేసీఆర్‌ పరిశీలించారు. సీఎం వెం ట మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీలు బాల్క సుమన్, బి.వినోద్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టును ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం.. అనంతరం హైదరాబాద్‌ వెళ్లారు.
పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని సొరంగాన్ని పరిశీలిస్తున్న సీఎం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top