ఏఎఫ్‌ఆర్‌సీ ఏర్పాటు ఎప్పుడు? 

     పట్టించుకోని ప్రభుత్వం 

     అది ఏర్పాటు అయితేనే రానున్న మూడేళ్ల ఫీజు ఖరారు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరం నుంచి 2021–22 సంవత్సరం వరకు ఇంజనీరింగ్‌ సహా పలు వృత్తి విద్యా కోర్సులకు వసూలు చేయాల్సిన వార్షిక ఫీజు ఖరారుపై ఇంకా కార్యాచరణ మొదలుకాలేదు. దాదాపు 650 వరకున్న వృత్తి విద్యా కాలేజీల్లో వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారుపైనా సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఏఎఫ్‌ఆర్‌సీని ఏర్పాటు చేస్తేనే కమిటీ బాధ్యులు కోర్సుల వారీగా కాలేజీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి, ఫీజులను ఖరారు చేసే అవకాశం ఉంటుంది.

కానీ ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ నియామకంపైనే ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి సారించలేదు. 2015లో ఏర్పాటైన ఏఎఫ్‌ఆర్‌సీ 2016–17 విద్యా సంవత్సరం నుంచి వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసింది. ఆ కమిటీ గడువు డిసెంబర్‌తో ముగిసింది. పైగా ఆ కమిటీ ఖరారు చేసిన ఫీజులు 2018–19 విద్యా సంవత్సరంతో ముగియనున్నాయి. 2019–20 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లపాటు కొత్త ఫీజులను ఖరారు చేసి అమలు చేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఈ సారి ఏఎఫ్‌ఆర్‌సీని ఏర్పాటు చేస్తారా? లేదా ప్రస్తు తం ఉన్న ఫీజులనే వచ్చే మూడేళ్ల పాటు కూడా కొనసాగిస్తారా? అన్న గందరగోళం నెలకొంది. 

ఏఎఫ్‌ఆర్‌సీపై అనుమానాలు.. 
ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ను నియమించే క్రమంలో ప్రభు త్వం ముగ్గురు రిటైర్డ్‌ హైకోర్టు జడ్జీల పేర్లను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించాల్సి ఉంటుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓకే చేస్తారు. ఆ తరువాత కమిటీలో ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖ, ఆర్థిక శాఖ అధికారులు సభ్యులుగా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు ప్రారంభించకపోవడంపై కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

2016–19 ఫీజులను ఖరారు చేసిన ఏఎఫ్‌ఆర్‌సీపై కాలేజీల యాజమాన్యాల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని టాప్‌ కాలేజీలకు కూడా అడ్డగోలుగా కోత పెట్టడం, కొన్ని సాధారణ కాలేజీలకు అసాధారణంగా ఫీజులను పెంచడం అనేక విమర్శలకు, ఆరోపణలకు దారితీసింది. టాప్‌ కాలేజీలు కొన్ని హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆ ఫైళ్లను తెప్పించుకొని నిర్ఘాంతపోయింది. ఫీజుల ఖరారు ఫైళ్లపై ఇద్దరి సంతకాలే ఉం డటం ఏంటని, అలా ఎలా చేశారని ప్రశ్నించింది. హైకోర్టు ఆ టాప్‌ కాలేజీల ఆదాయ వ్యయాలను పరిశీలించి ఫీజులను నిర్ణయించింది. ఈసారైనా ఆదాయ వ్యయాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ఫీజులను ఖరారు చేసే వారిని నియమించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top