ల్యాంకో భూములను వెనక్కి తీసుకుంటాం

ల్యాంకో భూములను వెనక్కి తీసుకుంటాం


* కొత్తగా తెలంగాణ వక్ఫ్ యాక్ట్

* నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడి

* సాగుకు యోగ్యమైన భూములనే దళితులకు పంపిణీ చేస్తాం

* ప్రతి మహిళా గ్రూపునకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు

 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ల్యాంకో హిల్స్ గ్రూపునకు కేటాయించిన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు వెల్లడించారు. అలాగే వక్ఫ్ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్నారు. ల్యాంకోకు కేటాయించిన భూములు వక్ఫ్ ఆస్తులేనని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. అవి వక్ఫ్ భూములు కావంటూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసిందని, ఆ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోనున్నట్టు   చెప్పారు.

 

శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో వక్ఫ్ భూములపై సమీక్షా సమావేశం జరిగింది. దాదాపు 66 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన వక్ఫ్ భూముల సమీక్షకు మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో మొదటి సర్వేలోనే దాదాపు 26వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు తేలిందని, కానీ ఇందులో 80 శాతం ఆక్రమణకు గురైందని, మరో 20 శాతం భూమికి సరైన రికార్డులు లేవన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. దీనికోసం చట్టంలో సవరణ చేసి తెలంగాణ వక్ఫ్ యాక్ట్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిరుపేద ముస్లింల అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు.

 

కరెంటు కోతలు వద్దు

రంజాన్ మాసంలో విద్యుత్తు కోతలు లేకుండా చూడాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. చినచిన్న మరమ్మతుల కోసం ఒక్కో మసీదుకు రూ. 5వేల చొప్పున నిధులు ఇప్పటికే మంజూరు చేశామని, ఆ నిధులను వెంటనే మసీదు కమిటీలకు అందజేయాలని ఆయన తహశీల్దార్లను ఆదేశించారు. కాగా రంజాన్ మాసాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందని, ఏదో ఒక రోజు జిల్లా కలెక్టరేట్లలో ప్రభుత్వ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామన్నారు.

 

సాగుకు యోగ్యమైన భూమినే ఇద్దాం

నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అది కూడా నూటికి నూరుపాళ్లు సాగుకు యోగ్యమైన భూములనే ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు భూమిని ఎంపిక చేసేటప్పుడే జాగ్రత్తపడాలన్నారు. భూ పంపిణీ కమిటీ.. స్థానిక యువకుల్లో ఒకరిని, మహిళా సంఘాల నుంచి ఒకరిని కమిటీ సభ్యులుగా తీసుకుని వారు సూచించిన భూములకే ప్రాధాన్యత ఇచ్చి, కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు.

 

సంక్షేమ పథకాలలో మహిళ సంఘాలకు ప్రాధాన్యం

ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకంలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు ప్రతి గ్రూపునకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలను ఇస్తామని ప్రకటించారు. గ్రామీణ అభివృద్ధి శాఖలోని ఉపాధి హామీ పధకం నుంచి రూ. 200 కోట్లు, మార్కెటింగ్ శాఖ నుంచి రూ. 100 కోట్లు తీసుకుని ప్రతి ఐకేపీ కేంద్రంలో రూ.30 నుంచి రూ .40 లక్షలలో ధాన్యం గోదాంను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు ఒక సిమెంట్ గచ్చు(కారిడార్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top