సుగంధ దినుసుల పార్క్‌ ఏర్పాటుకు సిద్ధం


- తెలంగాణ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం

- మిర్చి ఎగుమతికి మార్కెట్లు అన్వేషిస్తున్నాం

- కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌




సాక్షి, న్యూఢిల్లీః పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయడం సాధ్యపడదని కేంద్ర వాణిజ్య శౠఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. స్పైస్‌ బోర్డు పరిధిలో 51 రకాల సుగంధ దినుసులు ఉన్నాయని, అందులో పసుపు కూడా ఒకటని వివరించారు. పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుచేయాలని తెలంగాణ ఎంపీలు, మంత్రుల నుంచి విన్నపాలు వచ్చాయని, అయితే విడిగా బోర్డు ఏర్పాటు చేయలేమని వివరించారు.



‘సుగంధ దినుసుల అభివృద్ధి సంస్థ(ఎస్‌డీఏ)ను ఏర్పాటు చేసుకునేందుకు వీలుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్న సుగంధ దినుసులకు చేయూత ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. కొన్ని రాష్ట్రాల్లో మిర్చి తదితర పంటల కోసం ఏర్పాటుచేశాం. తెలంగాణలో పసుపు అభివృద్ధి కోసం ఎస్‌డీఏతో పాటు సుగంధ దినుసుల పార్క్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ పార్క్‌ ద్వారా గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవచ్చు. మసాలాల తయారీకి వీలుగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇక్కడ ఏర్పాటుచేసుకోవచ్చు. ప్రయివేబుట భాగస్వాములు కూడా వస్తారు. టర్మరిక్‌ మిల్క్‌ వంటి విలువైన ఉత్పత్తులు కూడా వెలికితీయొచ్చు. పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదన వస్తే మేం పరిగణనలోకి తీసుకుంటాం..’ అని పేర్కొన్నారు.



ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మిర్చి ఉత్పత్తుల సేకరణకు సంబంధించి మీడియా ప్రస్తావించగా ‘మిర్చి పంట ఎక్కువగా వచ్చింది. ఎక్కువగా రావడం వల్ల ధర తగ్గింది. సమస్య పరిష్కారానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. మిర్చి ఎగుమతుల కోసం విదేశీ మార్కెట్లను అన్వేషిస్తున్నాం. ఏ రకానికి ఏ మార్కెట్లో డిమాండ్‌ ఉందో ప్రస్తుతం పరిశీలన చేస్తున్నాం..’ అని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top