చెరువు ఎండిపాయే..

Water Crisis In Ponds In Telangana  - Sakshi

కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిండినా..చెరువులు మాత్రం ఖాళీ

23 వేలకుగాను నిండినవి 300లు

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు ఓవైపు వరద ఉధృతితో జలకళను సంతరించుకుంటే... గ్రామీణ వ్యవసాయానికి పట్టుగొమ్మల్లాంటి చెరువులు మాత్రం చిన్నబోతున్నాయి. ఏటా ఈ సమ యానికల్లా నీటితో కళకళలాడాల్సిన చెరువులన్నీ తీవ్ర వర్షాభావంతో వట్టిపోతున్నాయి. రాష్ట్రంలో 44 వేలకుపైగా ఉన్న చెరువుల్లో ఏకంగా 26 వేల పైచిలుకు చెరువుల్లో నీటి జాడ కానరావడం లేదు. కృష్ణాబేసిన్‌లోని పూర్వ మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోనే 21వేలకు పైగా చెరువులు  నీటి కరువుతో అల్లాడుతున్నాయి.  

కృష్ణా బేసిన్‌లో గుండె చెరువు.. 
ఎగువ నుంచి భారీ వరదల కారణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వంటి ప్రాజెక్టులు 15 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిండాయి. అయితే పరీవాహకంలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా బేసిన్‌ పరిధిలోని చెరువుల పరిస్థితి దారుణంగా ఉంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మొత్తంగా 23,608 చెరువులు ఉండగా ఇందులో 21,133 చెరువుల్లో 25% కన్నా తక్కువ నీరే చేరింది. 25 నుంచి 50% మాత్రమే నీరు చేరిన చెరు వులు 1,656 వరకున్నాయి. 524 చెరువుల్లో 50 నుంచి 75% నీరుండగా, కేవలం 295 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 85% చెరువులు చుక్కనీటికి నోచుకోలేకపోయాయి. పూర్వ రంగారెడ్డి జిల్లా పరిధిలో 3,791 చెరువులకు గానూ 3,611 చెరువులు ఖాళీగానే ఉన్నా యి. చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో కృష్ణా బేసిన్‌ పరిధిలో మొత్తంగా 11 లక్షల ఎకరాలపై ప్రభావం పడుతోంది. కృష్ణా బేసిన్‌తో పోలిస్తే గోదావరిలో కొద్దిగా మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బేసిన్లో 20వేలకుపైగా ఉన్న చెరువుల్లో 9వేలకు పైగా చెరువులు  జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరిం ది. ఎగువన ప్రాజెక్టుల గేట్లు మూసివేయడంతో దిగువకు వరద ప్రవాహం తగ్గుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో గోదావరి ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ ప్రకటించింది. నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top